ఆశలన్నీ సుప్రీంపైనే: సోమవారం విచారణకు రోజా సస్పెన్షన్ పిటిషన్
న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీలో ఏడాది పాటు సస్సెన్షన్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్‌పై డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సోమవారం సుప్రీంకోర్టులో రోజా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే తన గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి సభలో మాట్లాడినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆమె ఆరోపించారు.

ఏపీలో అవినీతి రహిత పాలన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ అడ్డంగా దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ డబ్బులతోనే తండ్రీకొడుకులిద్దరూ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను అధికారపక్షం ఏ విధంగా టార్గెట్ చేస్తుందో, ప్రజా సమస్యలపై సభలో నిలదీసే వారి గొంతు ఏవిధంగా తొక్కేయాలని అధికారపక్షం చూస్తుందో అందులో వివరించారమని తెలిపారు. దీంతో న్యాయస్థానం తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుందని అన్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అధికారపార్టీ ధిక్కరించిందని, అసెంబ్లీకి కూడా వెళ్లకండా తనని అడ్డుకున్నారని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం టీడీపీ ప్రభుత్వం ధిక్కరించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారని ఈ సందర్భంగా రోజా సూటిగా ప్రశ్నించారు.
గాలి బెయిల్ కుంభకోణంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు
కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో కేసులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన పట్టాభిరామారావు కోట్లాది రూపాయలను లంచంగా తీసుకుని పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులకు ప్రత్యేక కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications