బ్యాక్ టు హైకోర్టు: నగరి ఎమ్మెల్యేగా రోజా ‘ఎన్నిక’పై సుప్రీంలో విచారణ
అమరావతి: వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా భవితవ్యంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టుకు వెళ్లాలని రోజాకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో పాటు కౌంటర్ దాఖలు చేసుకునేందుకు రోజాకు అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.
ఈ ఏడాది చివరికల్లా ఎమ్మెల్యే రోజా పిటిషన్‌పై విచారణను పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. వివరాల్లోకి వెళితే... గడచిన ఎన్నికల్లో నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి బరిలోకి దిగిన రోజా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల్లో తేడాలున్నాయని రాయుడు అనే వ్యక్తి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే రోజా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నికను రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రోజాకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన రోజా తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు, రెండింటిపై ఒకేసారి ఇరువురి వాదనలు వింటామని ప్రకటించింది. కాగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రోజా ఒకేసారి రెండు పిటిషన్ల వాదనలు వినడం చట్టబద్దం కాదన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఒకేసారి రెండు పిటిషన్ల వాదనలు వినడం కాకుండా వేర్వేరుగా అవకాశం కల్పించాలని సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకున్నారు. రోజా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications