6800 కోట్ల కుంభకోణం: టీడీపీ నేతల హస్తంపై మండిపడ్డ శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: సోమవారం ఆగ్రిగోల్డ్ అంశంపై ఏపీ శాసనసభా సమావేశం దద్దరిల్లింది. అగ్రిగోల్డ్ అంశం 6800 కోట్ల కుంభకోణమని, 32 లక్షల మంది డిపాజిటర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని దీనిపై అసంబ్లీలో తక్షణమే చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సభ ప్రారంభానికి ముందే అగ్రిగోల్డ్ బాధితులు, వారికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అనంతరం సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు ప్టటుబట్టారు.
సభా సమయాన్ని వృథా చేయొద్దంటూ స్పీకర్ ప్రతిపక్ష సభ్యులను కోరినా వాయిదా తీర్మానంపై చర్చను ప్రారంభించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టి గట్టిగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

ఈ సమయంలో అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. కోర్టు ఎక్కడ విచారణ జరుపుతుందోనని భయపడి ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీఐడీ విచారణకు ఆదేశించిందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన మండిపడ్డారు.
వారికి సంబంధించిన ఆస్తులను ఎటాచ్ మెంట్ నుంచి తప్పించి లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల పొట్టగొట్టారని అన్నారు. పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తూ చివరకు పోలీసు వ్యవస్ధను కూడా తెలుగుదేశం ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 42 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన జిల్లా, మండల కేంద్రాల్లో ఇళ్ల స్థలాల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు.
కార్పోరేషన్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును వెంటనే పెంచాలని అన్నారు. గతంలో మాదిరిగానే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై వెంటనే చర్చించాలని ప్రతిపక్ష వైసీపీ ఏపీ అసెంబ్లీలో పట్టుబడుతోంది.
అయితే ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ తర్వాత ఈ అంశంపై చర్చిస్తామని స్పీకర్ కోడెల స్పష్టం చేసినప్పటికీ.... ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూనే ఉన్నారు. మంత్రి ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారని ఇంతకుముందే పలు సందర్భాల్లో ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రస్తావించించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications