పార్టీ కండువా ఎప్పుడు మారుస్తున్నావ్..వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన జగన్..?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ పేర్కొంటూ వస్తున్నారు.ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని జగన్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.అయితే కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టనుండటంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే జగన్‌తో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని అసెంబ్లీకి రాగా, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం కండువా కప్పుకోలేదు.దీన్ని గమనించిన వైసీపీ అధినేత జగన్ , సదరు ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేశారు.సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని వస్తే నువ్వెందుకు కండువా వేసుకోలేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ని జగన్ ప్రశ్నించారు.కండువా మర్చిపోయానని చంద్రశేఖర్ జగన్‌కు సమాధానం ఇచ్చారు.దీనిపై జగన్ మాట్లాడుతూ..కండువా మర్చిపోయావా.. మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ ఎమ్మెల్యేని ప్రశ్నించారు.దీనిపై ఏం మాట్లాడకుండా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఈ వార్తలను ఎమ్మెల్యే ఖండించారు. తనపై టీడీపీ అనుకూల మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.దళిత ఎమ్మెల్యేలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ 11 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్యే తాటిపర్తి పేర్కొన్నారు. 2019లో ఓటమి పాలైన తర్వాత 3 సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో కనిపించలేదన్నారు. ఒకరు ఆర్థిక లావాదేవీలు చూసుకుంటే, మరొకరు సినిమాలతో బిజీ అయిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పిట్ట కథలు చెబుతోందన్నారు. వైసీపీ పాలనలో జగన్ చేసిన అభివృద్ధి ఎవరిని అడిగినా చెబుతారని... తాము ప్రజల్లోనే ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు.












Click it and Unblock the Notifications