నందికొట్కూరు మంట చల్లారలేదా? బైరెడ్డితో సమస్యల్లేవంటూనే: రేపు జగన్ వద్దకు వైసీపీ ఎమ్మెల్యే..!
కర్నూలు: కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు ఇంకా సమసి పోనట్టుగానే కనిపిస్తోంది. నియోజకవర్గానికి చెందిన పార్టీ యువ నాయకుడు, ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తామిద్దరం కలిసి పని చేస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్ స్పష్టం చేశారు.
అదే సమయంలో- తాను శనివారం తాడేపల్లికి వెళ్తున్నానని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుంటానని ట్విస్ట్ ఇచ్చారు. దీనితో కథ మళ్లీ మొదటికే వచ్చిందనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. తనను కలవాలంటూ వైఎస్ జగన్ ఫోన్ చేశారని ఆయన వెల్లడించారు. జగన్‌తో సమావేశమైన తరువాత తాను ఏ నిర్ణయాన్నయినా ప్రకటిస్తానని అన్నారు. రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నానని ఆయన తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. నందికొట్కూరు మార్కెట్ యార్డు కమిటీ పదవులు తన వర్గానికి రాలేదనే ఆవేదన ఉందని, తాము మనస్తాపానికి గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయినప్పటికీ.. దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పారు. పదవులు వచ్చిన వారికి శుభాకంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. పదవుల కోసం కాకుండా.. నియోజకవర్గ ప్రజల కోసమే తాము పనిచేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలే తనకు గానీ, తన వర్గానికి గానీ శిరోధార్యమని స్పష్టం చేశారు. జగన్ ఇచ్చే హామీకి గానీ, ఆయన తీసుకునే నిర్ణయానికి గానీ కట్టుబడి ఉంటానని చెప్పారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్ధానాల్లో గెలుపొంది ముఖ్యమంత్రిగా కానుకగా ఇస్తామని అన్నారు. దీనికోసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి పని చేస్తామని ఆర్థర్ స్పష్టం చేశారు.బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అర్థర్ పేర్కొన్నారు. నియోజక వర్గంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నానని, అవే తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని అన్నారు.
Recommended Video

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను కాదని, జగన్ తనకు పిలిచి టికెట్ ఇచ్చారని, ఆ కృతజ్ఙత తనకు ఉందని చెప్పారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జిల్లాలో అడుగు పెట్టనివ్వమంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. తన అనుచరులెవ్వరూ ఆయనను బెదిరించలేదని చెప్పారు. దీని వెనుక కొందరు బయటి వ్యక్తుల కుట్ర ఉందని చెప్పారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందలేదని, ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.












Click it and Unblock the Notifications