చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే కల్పన..
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు శ్రమిస్తున్న తీరు తనను ఆకట్టుకుందని, ప్రగతి పథంలో ఆయనకు అండగా నిలిచేందుకే పార్టీ మారుతున్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యే కల్పన తెలిపారు.
విజయవాడ: పామర్రు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కల్పన టీడీపీ గూటికి చేరారు. అధినేత చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు శ్రమిస్తున్న తీరు తనను ఆకట్టుకుందని, ప్రగతి పథంలో ఆయనకు అండగా నిలిచేందుకే పార్టీ మారుతున్నట్టుగా కల్పన తెలిపారు.
రాష్ట్రంలో పామర్రు నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టాలన్న ఆశయంతోనే టీడీపీలో చేరుతున్నట్టు ఈ సందర్బంగా కల్పన ల్లడించారు.

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ వెనకబడకూడదని, టీడీపీలో చేరితే నిధులకు ఇబ్బంది ఉండదని కల్పన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉంటే నిధులకు ఇబ్బంది ఉందని, సీఎం ప్రత్యేక ఫండ్ నుంచి నిధులు తెచ్చుకునేందుకు టీడీపీలో ఎక్కువ అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
తనతో పాటు 30మంది సర్పంచ్ లు, 20మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొంతమంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు కల్పన తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని కల్పన అన్నారు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఆయన పనితీరుకి తాము ఆకర్షితులమయ్యామని చెప్పారు. గతంలో తాను టీడీపీలో కొన్ని సంవత్సరాలు ఉన్నానని గుర్తుచేసుకున్నారు.
టీడీపీలో చేరడం తన సొంత కుటుంబ సభ్యుల వద్దకు తిరిగివచ్చినట్టుందని కల్పన అన్నారు. పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రెండేళ్లుగా నియోజకవర్గానికి ఏమి చేయలేకపోయాననే బాధలో ఉన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ఆశయ సాధనకు తామంతా అండగా నిలబడుతామని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి:
టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున నేతలు పార్టీలో చేరుతున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్వస్థలం నుంచి వచ్చిన నేతలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీలోకి వచ్చిన నేతలంతా.. ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించి పనిచేయాలన్నారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఆదాయం కూడా లేని పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నో సమస్యలను అంచెలంచెలుగా అధిగమిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు.
నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకి నిధులు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 16న ఢిల్లీ వెళ్లి మొదటి విడతగా రూ.1918 కోట్ల చెక్కును అందుకున్నట్లు తెలిపారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications