వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూటి పోటి మాటలు: ఫిరాయించిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీలో ఛీత్కారాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: 'అధికారం లేకుండా రెండేళ్లు కూడా ఉండలేరా?' 'ఇప్పటికి రెండుపార్టీలు మార్చావు. రేపు ఈ పార్టీ మారవని గ్యారంటీ ఏమిటి'? ' మిమ్మల్ని గెలిపించిన వేలాది మంది ఓటర్లను మోసం చేశావు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇక్కడ మేం చెప్పినట్లు వినాల్సిందే' ఈ మాటలన్నీ కూడా అధికారపక్షంపై విపక్షాల విమర్శలనుకంటే పొరపాటే.

వైసీపీ టికెట్ మీద గెలిచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి టీడీపీకి చెందిన నేతలు చేస్తున్న సూటి పోటి విమర్శలు. గడచిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధికారంలో ఉండటంతో వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి అంటూ టీడీపీలోకి ఫిరాయించారు.

ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు వద్ద నియోజకవర్గంలో కలిసిపోతామంటూనే, కొత్తగా పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీకి చెందిన నేతలు అడుగడుగునా అవమానిస్తున్నారు. అంతేకాదు టీడీపీ కార్యకర్తల వద్ద నిరాదరణకు గురవుతున్నారు. వైసీపీ నుంటి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై కొంత మంది టీడీపీ కార్యకర్తలైతే మీరెందుకు వచ్చారు? మళ్లీ రేపు అధికారం రాదనుకుంటే వెళ్లిపోతారని నిర్మొహమాటంగా వేదికల మీదే దుమ్మెత్తిపోస్తున్నారు.

Ysrcp mlas dishonour in tdp party

దీంతో టీడీపీ ఆపరేషన్ 'ఆకర్ష్'కు లోనై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామన్నట్లు తయారైంది. తాజాగా జరుగుతున్న మినీ మహానాడుల్లో వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ప్రవేశం ఉండటం లేదు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులే మినీ మహానాడు నిర్వహించుకుంటున్నారు.

ఈ మినీ మహానాడుకు కొత్తగా చేరిన వైసీపీ కింది స్థాయి నాయకులు కూడా హాజరవడం లేదు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మాజీ మంత్రి కరణం బలరాం ఆధ్వర్యంలో మినీమహానాడు నిర్వహించారు. దానికి కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఆహ్వానించలేదు.

అంతేకాదు ఈ మినీ మహానాడు వేదికలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేతలపై దుమ్మెత్తుపోసేందుకు నియోజకరవర్గానికి చెందిన టీడీపీ నేతలు వినియోగించుకున్నారు. కరణం బలరాం నిర్వహించిన మినీ మహానాడులో గొట్టిపాటి రవికుమార్‌‌పై బలరాం బహిరంగంగానే దుమ్మెత్తిపోయగా, ఆయన అనుచరులు కూడా వేదికపై నుంచి గొట్టిపాటిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

నువ్వు 99 వేల మందిని మోసం చేసి మా పార్టీలో చేరావు. అధికారం కోసం, పనుల కోసం, ఆస్తుల రక్షణ కోసం పార్టీలో చేరిన నువ్వు ఇప్పటికి రెండు పార్టీలు మారావు. రేపు ఇంకో పార్టీలోకి వెళ్లవని గ్యారంటీ ఏమిటని' వేదిక మీద నుంచే విమర్శించారు. పార్టీలోకి వచ్చిన వారెవరైనా తాము చెప్పినట్లు వినాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇక కదిరిలో కూడా ఇదే పరిస్థితి. కొత్తగా చేరిన ఎమ్మెల్యే చాంద్‌పాషా లేకుండానే ఇన్చార్జి కందిగుంట ప్రసాద్ ఆధ్వర్యాన మినీ మహానాడు ఏర్పాటుచేశారు. తాను వెళితే ఘర్షణ జరుగుతుందని తెలియడంతో పాషా వెళ్లకుండా ఉన్నారు. దానికి హాజరైన పయ్యావుల కేశవ్.. ఎమ్మెల్యే చాంద్‌పాషాపై సెటైర్లు వేశారు.

'మేం పదేళ్లు విపక్షంలో ఉండి, ఎవరికీ లొంగకుండా, భయపడకుండా పోరాడాం. కానీ కొంతమంది రెండేళ్లు కూడా విపక్షంలో ఉండలేకపోతున్నారు' అనడం బట్టి, చాంద్‌పాషా పరిస్థితి, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు ఇచ్చే ఆదరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

మరోవైపు నంద్యాలలో ఎమ్మెల్యే భూమా-శిల్పా, ఆళ్లగడ్డలో అఖిలప్రియ-ఇరిగెల రాంపుల్లారెడ్డి, డోన్‌లో ఏరాసు-కేఈ వర్గాల మధ్య పరిస్థితి కూడా ఇలానే ఉంది. తాజాగా కడప జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడి ప్రాంతానికి వెళ్లిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి రామసుబ్బారెడ్డిని, వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తమ గ్రామాల్లోకి నువ్వెలా వస్తావని విరుచుకుపడ్డారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కడప జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యే జయరాములు అభివృద్ధి పనులు చేయాలని కోరితే బాబు దగ్గరకు వెళ్లి, నిధులు తెచ్చుకోవాలని వ్యాఖ్యానిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

మీరు బాబు సమక్షంలో చేరారు కాబట్టి వెళ్లి బాబుకో చెప్పుకోమని మరికొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎమ్మెల్యేల ముఖం మీదే చెబుతున్నారు. అటు అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇన్ చార్జిలు చెప్పిందే చేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

టిడిపిలో చేరినప్పటికీ, నియోజకవర్గ ఇన్ చార్జులే పెత్తనం చేస్తుంటే, ఏమీ చేయలేని అవమానభారంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. కనీసం వైసీపీలోనే కొనసాగితే గౌరవం అయినా ఉండేదని, ఇక్కడకు వచ్చి పొరపాటు చేశామన్న పశ్చాత్తాపం మొదలైందని కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలోకి తీసుకునే ముందు వరకు గౌరవంగా చూసిన టీడీపీ నాయకత్వం, పార్టీలో చేరిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం మానేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన పార్టీ మారిన ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది.

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇన్ చార్జిలు ఎవరన్నది ప్రకటించకపోడవమే ఈ దుస్థితికి కారణమని నేతలు అంటున్నారు. పార్టీలో చేరేముందు మండలాధ్యక్షులు, పార్టీ నేతల ముందు మాత్రం మీ నాయకుడే మా ఇన్‌చార్జి అని చెబుతున్నారని, తీరా సమస్య వచ్చాక పట్టించుకోవడం మానేశారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

English summary
Ysrcp mlas dishonour in tdp party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X