వైసీపీకి జగన్ సన్నిహిత నేత గుడ్ బై..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీకి.. మండలిలో మెజార్టీ ఉంది. ఇక, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు పలువురు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా.. వారిని వారించే ప్రయత్నాలు జరగటం లేదు. ఇటు జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. తాజాగా జగన్ కు సన్నిహిత నేతగా పేరున్న మరో ముఖ్యనేత పార్టీకి రాజీనామా చేసారు.
మర్రి రాజశేఖర్ రాజీనామా
వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేసారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే.. గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేసా రు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు రాజీనామా చేసారు. వారి రాజీనామాలు ఆమోదం పొంద లేదు. ఇప్పుడు అయిదో ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేసారు. కొంత కాలంగా మర్రి రాజీనామా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, జిల్లాకు చెందిన మాజీ మంత్రి అభ్యంతరంతో టీడీపీలో చేరిక అంశం పైన స్పష్టత రాలేదు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హామీ విస్మరించిన జగన్
మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట 2004లో చిలకలూరిపేట నుంచి స్వతంత్ర అభ్యర్దిగా గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వైసీపీ ఏర్పాటు తరువాత ఆయన పార్టీలో చేరారు. 2014 లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో పోటీకి సిద్దమయ్యారు. ఆ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనీకి నాడు జగన్ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల సమయంలోనే మర్రి రాజశేఖర ను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయినా, పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా కాలం తరువాత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇక, మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. తన మంత్రివర్గ విస్తరణలో విడదల రజనీకి అవకాశం కల్పించారు.

టీడీపీలోకి ఎంట్రీ
అప్పటి నుంచి మర్రి రాజశేఖర్ కు పార్టీలో ప్రాధాన్యత దక్కింది. మర్రిని కలుపుకుపోవటంలో రజనీ నిర్లక్ష్యం చేసారు. 2024 ఎన్నికల సమయంలో క్రిష్ణా జిల్లా బాధ్యతలను మర్రికి జగన్ అప్పగించారు. 2024 ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి గుంటూరు మేయర్ కావటి మనోహర్ ను బరిలోకి దింపారు. ఎన్నికల్లో పరాజయం తరువాత జగన్ తిరిగి చిలకలూరిపేట వైసీపీ బాధ్యతల ను మాజీ మంత్రి రజనీకి అప్పగించారు. 2024 లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజనీ ఎన్నికల్లో ఓడారు. తిరిగి చిలకలూరిపేట బాధ్యతలు రజనీకి కేటాయించటంతో పార్టీ వీడాలని మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరిగింది. పార్టీ కోసం కట్టుబడి ఉన్నా.. గుర్తింపు లేకపోవటం పైన మర్రి రాజశేఖర్ మనస్థాపానికి గురయ్యారు. ఇక, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన రాజశేఖర్ త్వరలోనే టీడీపీ చేరటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications