మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు: మ్యానిఫెస్టో మంటలు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేనిఫెస్టో పై వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని, అబద్దానికి పసుపు రాసినట్టు టిడిపి మేనిఫెస్టో ఉందని వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగన్ ఆలోచనలు నోబెల్స్.. చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్:
తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నేడు మీడియాతో మాట్లాడుతూ మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదని, చంద్రబాబు మాటలలో నిజం ఉండదని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్ అంటూ ఆమె పేర్కొన్నారు. 2019 టిడిపి మేనిఫెస్టో ఇచ్చిన అంశాలు ఇవి అని చెప్పే దమ్ము తెలుగుదేశం పార్టీకి లేదన్నారు.

మాట తప్పిన చంద్రబాబు
టిడిపి గత మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో కనీసం ఐదు హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదని అని ఆరోపించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబును జనం నమ్మరని వరుదు కళ్యాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీడీపీ మ్యానిఫెస్టో నమ్మి ఓటేస్తే నిండా మునిగినట్టే
అంతేకాదు కూటమి మేనిఫెస్టో ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, టిడిపి మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేస్తే ప్రజలు నిండా మునిగి పోతారని ఆమె పేర్కొన్నారు. టిడిపికి ఓటు వేస్తే నాడు నేడు ఆరోగ్యశ్రీ కొనసాగే పరిస్థితి లేదని, అమ్మ ఒడి, గోరుముద్ద, స్కూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వద్దనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. పొత్తులతో ఎన్నికలకు వెళుతున్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడరన్నారు .
టిడిపిది ప్రజాగళం కాదు యమ గళం
ప్రత్యేక హోదా గురించి, రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టిడిపిది ప్రజాగళం కాదు యమ గళమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని ముఖ్యంగా ఉత్తరాంధ్ర పురోగతికి జగన్ ఎంతో పనిచేశారని వరుదు కళ్యాణి వెల్లడించారు. విశాఖ రాజధాని నగరంగా మారితే ఈ ప్రాంతంలో వలసలు ఆగిపోతాయని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications