నారా లోకేష్ తో చేయి కలిపిన వైసీపీ ఎంపీ ! పార్టీ మార్పు ఊహాగానాల వేళ ?
ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీ మరో 8 నెలల్లో ఎన్నికలకు సిద్దమవుతోంది. ఎన్నికల ఏడాది వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాష్ట్రంలో రాజకీయం సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎక్కడైనా ఒక్కచోట కలిసి కనిపిస్తే చాలు ఊహాగానాలు మొదలైపోతున్నాయి. అలాంటిది ఇరు పార్టీల్లో ఇద్దరు కీలక నేతలు ఒకే చోట కనిపించి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకుంటే ఇంకేమైనా ఉందా.. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.
రెండు రోజుల క్రితం చనిపోయిన చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు టీడీపీ యువనేత నారా లోకేష్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయనకు తారసపడ్డారు. కాసేపట్లోనే లోకేష్ ను పలకరించేందుకు ఆయన దగ్గరికి వెళ్లారు. లోకేష్ తో చేతులు కలిపారు. దీంతో వీరిద్దరూ కాసేపు పలకరించుకున్నారు.

నరసరావుపేట నుంచి తొలిసారి లోక్ సభ ఎంపీగా ఎన్నికైన విజ్ఢాన్ రత్తయ్య కుమారుడు లావు కృష్ణదేవరాయలు ఈ మధ్య వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీనికి కారణం పల్నాడు జిల్లాలో తాజాగా మంత్రి అయిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వైఖరే. రజనీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె నియోజకవర్గానికి వెళ్లనివ్వకుండా లావును అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతోంది. అది ఆమె మంత్రి అయ్యాక మరింత తీవ్రమైంది.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను కాదని విడదల రజనీకి వైసీపీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందన్న అసంతృప్తితో ఉన్న లావు కృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో లావు కృష్ణదేవరాయలు లోకేష్ తో చేతులు కలపడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలోనూ పార్లమెంటుతో టీడీపీ ఎంపీలతో కలిసి దర్శనమిచ్చిన లావు.. ఈసారి ఏకంగా లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ప్రత్యర్ధులు తిరిగి ఆయన పార్టీ మార్పు ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు.












Click it and Unblock the Notifications