బీజేపీ వైపు మిథున్ చూపు - ఢిల్లీ కేంద్రంగా..!!
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. మూడు పార్టీల కూమటి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల్లో ఊహించని పరాజయం పొందిన వైసీపీ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఇటు వైసీపీ ముఖ్య నేత ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన మిథున్ స్పష్టత ఇచ్చారు. తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు.
వైసీపీ ముఖ్య నేత..రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణం చేసారు. మిథున్ లోక్ సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు. కొద్ది రోజులుగా మిథున్ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం సాగతోంది. బీజేపీ నేతలే ఈ ప్రచారం ప్రారంభించారు. దీని పైన స్పందించిన మిథున్ బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాను పార్లమెంట్ లో ఏపీ తరపున మాట్లాడతానన్నారు. పార్టీ మార్పు వార్తలపై ఘాటుగా స్పందించారు. హ్యాట్రిక్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.

ఎంపీగా మిథున్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనపై పుకార్లు షికార్లు చేశాయి. మిథున్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు లీకులిచ్చారు. ఆయనతోపాటు ఆయన తండ్రి పెద్ది రెడ్డిని కూడా బీజేపీలో చేర్చేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు వైసీపీ మద్దతిస్తుందని తెలిపారాయన. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండేవాటిని వ్యతిరేకిస్తామన్నారు. గతంలో కూడా తాను పార్టీ మారతానంటూ ఇలాగే తప్పుడు ప్రచారం జరిగిందన్నారు.
ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే మొదలు పెట్టారని మండిపడ్డారు. జగన్ తనను సొంత తమ్ముడిలా భావిస్తారని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి. జగన్ తోనే ఉంటూ, పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మిథున్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications