విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్
విజయవాడ: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న తన అనుచరులను విడిపించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్- స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడం కలకలం రేపింది. తన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
మంగళవారం రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కొందరు యువకులు ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము నందిగం సురేష్ అనుచరులమంటూ పోలీస్ స్టేషన్‌లో ఆ యువకులు హంగామా చేశారు. పోలీసులు వారిని విడిచిపెట్టలేదు. దీనితో కొందరు నందిగం సురేష్‌కు ఈ సమాచారాన్ని అందించడంతో ఆయన అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడారు.

అదుపులోకి తీసుకున్న వారందరూ తన అనుచరులేనని, వారిని వదిలేయాలని సూచించారు. మరోసారి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. స్వయంగా ఎంపీనే తమ కోసం పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయినట్లు చెబుతున్నారు. దీన్నంతటినీ వీడియో తీస్తోన్న ఓ కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీడియోను చిత్రీకరించిన సెల్‌ఫోన్‌ను సైతం తీసుకొని బయటకి వెళ్లిపోయారని సమాచారం.
తన ఫోన్ ఇవ్వాలంటూ అడిగిన ఆ కానిస్టేబుల్‌పై ఎంపీ అనుచరులు దౌర్జన్యం చేశారని అంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నందిగం సురేష్ సమీప బంధువు ఉన్నారని తెలుస్తోంది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరక్కుండా చూసుకుంటానని ఎంపీ ఇచ్చిన హామీ మేరకు పోలీసులు వారిని విడిచిపెట్టారని అంటున్నారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడం, స్వయంగా ఎంపీ రావడం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.












Click it and Unblock the Notifications