రఘురామకు కుక్కల వ్యాన్, బోన్ గతి: దేవుడు కూడా కాపాడలేడు: నందిగం సురేష్ ఉగ్రరూపం
అమరావతి: సాధారణంగా సౌమ్యంగా కనిపించే వైసీపీకి చెందిన బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్.. ఉగ్రరూపం దాల్చారు. సొంత పార్టీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై విరుచుకునిపడ్డారు. నిప్పులు చెరిగారు. రఘురామ కృష్ణంరాజు జైల్లోకి వెళ్లే రోజులు ఎంతో దూరం లేవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరాముడి తరహాలో పరిపాలన సాగిస్తున్నారని, అందుకే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రఘురామ ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పిటీషన్లు వేసుకున్నా ఉపయోగం ఉండబోదని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి మరో నలుగురు ప్రధాన అర్చకులు: ఆ కుటుంబాల నుంచి

అనర్హత వేటు తప్పదు..
కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న రఘురామ కృష్ణంరాజు నీతి, నియమాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. రఘురామ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగడానికి అనర్హులని చెప్పారు. అలాంటి వారిని రాజకీయాలలో కొనసాగిస్తే భావితరాలను మోసం చేసివారమవుతామని చెప్పారు. వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన వల్ల పార్టీకి నష్టమే గానీ..ఎంతమాత్రం లాభం లేదని నందిగం సురేష్ తేల్చి చెప్పారు.

బురదపాములాంటోడు..
రఘురామ కృష్ణంరాజు బురదపాములాంటోడని నందిగం సురేష్ విమర్శించారు. పార్టీ తరఫున అనర్హత వేటుకు నోటీస్ ఇచ్చినప్పుడల్లా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడని అన్నారు. తాను వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పు చేయలేదంటూ పార్టీలో తలదాచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సీబీఐ న్యాయస్థానంలో పిటీషన్ వేయడం ద్వారా తన లోపల ఉన్న బురదపామును బయటికి తీసుకొచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. రఘురామ కృష్ణంరాజు చర్యలను రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుని ఇప్పటికైనా లోక్‌సభ స్పీకర్ ఆయన వేటుపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

10వ షెడ్యూల్ కింద..
రాజ్యాంగంలోని 10 షెడ్యుల్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరుతున్నట్లు నందిగం సురేష్ చెప్పారు. ఏ మాత్రం ఉపేక్షించకుండా అనర్హత వేటు వేయాలని చెప్పారు. పార్టీ నుంచి అతణ్ని బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. రఘురామ కృష్ణం రాజు మాటలు వైసీపీకి కాకుండా పక్క పార్టీలు, వ్యక్తులకు మేలు చేసేలా ఉన్నాయని, వాళ్లకు దాయాదిగా పనిచేస్తున్నాడని మండిపడ్డారు. అతనికున్న సీబీఐ, ఏసీబీ కేసుల నుంచి బయటపడటానికి టీడీపీ, బీజేపీ భజన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రఘురామను పైనున్న దేవుడు కూడా కాపాడలేడని, జైలు జీవితం గడపడం ఖాయమని చెప్పారు.

కుక్కను ఎవరైనా చంపుతారా?
కడప నుంచి తనను చంపడానికి బ్యాచ్‌ను దింపారని రఘురామ ఆరోపిస్తున్నాడని, కుక్కను ఎవరైనా చంపుతారా..? అని ప్రశ్నించారు. కుక్కలను బోన్, వ్యాన్ వేసి పడతారని చురకలంటించారు. తాగడం, వాగడం.. రఘురామకు తెలిసినవి ఈ రెండేనని ఎద్దేవా చేశారు. సిగ్గు, శరం, నైతిక విలువలు ఉంటే ఏపీకి వచ్చి తిరగాలని నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఒక వర్గానికి చెందిన మీడియా కవరేజ్ ఇస్తుందని ఢిల్లీలో కూర్చొని ప్రెస్‌మీట్లు పెట్టి వాగడం మానుకోవాలని అన్నారు.

రాక్షస బ్యాచ్‌లో జత కట్టి..
వైఎస్ జగన్ పరిపాలన రామరాజ్యంతో సమానంగా సాగుతోందని, అందుకే ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని నందిగం సురేష్ అన్నారు. రాక్షస బ్యాచ్‌తో రఘురామ జట్టుకట్టాడని, ప్రెస్‌మీట్లు, డిబేట్లు పెట్టుకొని వాళ్లకు వారే నవ్వుకుంటూ శునకానందం పొందుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాక్షస బ్యాచ్‌కి దిమ్మతిరిగేలా ప్రజలు ఓటు హక్కు ద్వారా తీర్పు ఇచ్చారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే విధమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఢిల్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడే చవట, సన్యాసికి దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.