జగన్ బెయిల్ రద్దు: సీఎంగా సజ్జల -వైఎస్ భారతి సిమెంట్, చంద్రబాబు మజ్జిగలా : ఎంపీ రఘురామ సంచలనం
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా వైసీపీ సైతం ఎదురుదాడి చేస్తుండటంతో జగన్ వర్సెస్ రఘురామ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ కోర్టులో తన పిటిషన్ నెగ్గుతుందంటోన్న రెబల్ ఎంపీ.. జగన్ జైలుకు పోతారని, ఆంధ్రప్రదేశ్ కు డీఫ్యాక్టో ముఖ్యమంత్రిలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ పలు కీలక అంశాలను చెప్పుకొచ్చారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

వైసీపీ తరఫున క్షమాపణలు..
''ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతిలో రైతుల ఉద్యమం 600వ రోజుకు చేరిన సందర్భంగా ఆదివారం నాడు అక్కడి మహిళలు శాంతియుతంగా ఓ కార్యక్రమం చేపట్టారు. పానకాలస్వామి ఆలయం నుంచి న్యాయాలయం(హైకోర్టు) వరకు నడిచి వెళ్లి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నారు. పాలకులు పెడచెవిన పెడుతున్నారు కనుకే మహిళలు దేవుళ్లకు మొరపెట్టుకోవాలనుకున్నారు.
అలాంటి మహిళల్ని అతి దారుణంగా మగ పోలీసులతో హింసకు గురించేసింది జగన్ ప్రభుత్వం. నిజానికి నిన్న(ఆగస్టు 8) క్విట్ ఇండియా వార్షికోత్సవం. ఆనాడు బ్రిటిష్ పోలీసులు కూడా భారతీయులతో వ్యవహరించనంత కర్కషంగా ఏపీ పోలీసులు అమరావతి మహిళల పట్ల వ్యవహరించారు. నేనిప్పటికీ వైసీపీ సభ్యుడినే కాబట్టి, వైసీపీ ప్రభుత్వంలో భాగస్వామినే కాబట్టి నిన్న అమరావతిలో జరిగిన అన్యాయానికికి రైతులు, మహిళలకు క్షమాపణలు చెబుతున్నాను..

జగన్‌కు జైలు, అమరావతికి న్యాయం
అమరావతిలో రైతులు, మహిళలు చేస్తోన్న పోరాటానికి కౌంటర్ గా మూడు రాజధానుల్ని సమర్థిస్తూ చిలిపి ఉద్యమం చేస్తోన్న కొందరికి రాష్ట్ర పోలీసులే అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారు. రాజధాని విషయంలో జగన్, వైసీపీలు చేస్తోన్న అన్యాయాలు ఇంకా ఎంతోకాలం సాగబోవు. అమరావతి తరలింపుపై కోర్టుల్లో దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఆగిపోయిన విచారణలు మళ్లీ ఈనెల 23 నుంచి పున: ప్రారంభం అవుతాయి.
అమరావతి కేసుల్లో మళ్లీ వాదనలు మొదలువుతున్నాయి కాబట్టి, న్యాయదేవత కరుణిస్తుందనే నమ్మకంతో అందరం ఓపికగా ఉందాం. సీబీఐ కోర్టులో బెయిల్ రద్దయి జగన్ జైలుకు వెళతాడని, రాజధాని అమరావతికి న్యాయం దక్కుతుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను..

సీజేఐ రమణ చెప్పింది నా గురించా?
పోలీస్ స్టేషన్లో మానవ హక్కులు మంటగలుస్తోన్నాయని, విశేష అధికారాలు ఉన్నవారిపైనా పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పేదలంతా ఉచిత న్యాయసేవలను పొందేలా నల్సార్ వర్సిటీ రూపొందించిన యాప్ ఆవిష్కరణ సందర్బంగా సీజేఐ చేసిన కామెంట్లు నా గురించే అని చాలా మంది అనుకునే అవకాశముంది. నాపై జరగకపోయినా, పోలీస్ స్టేషన్లో చాలా మందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరుగుతోందని సీజేఐ వ్యాఖ్యలతో తేటతెల్లం అయింది. పోలీసులు పిచ్చి వేషాలేస్తే, మనకు అండగా న్యాయస్థానాలు ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలి. పోలీసులు పరిధిదాటి ప్రవర్తిస్తే శిక్షార్హులు అవుతారు. మరో ముఖ్యమైన అంశం..

ఏపీలో ఆర్టికల్ 356 విధించాలని..
రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు అందట్లేదని, రిటైర్మెంట్ తీసుకున్నవాళ్లకూ డబ్బులు అందడం లేదన్న ఐవైఆర్ కృష్ణారావు.. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని కోరడం ఎంతైనా సబబే. నా వంతుగా నేను కూడా జగన్ సర్కారు చేస్తోన్న దొంగ అప్పులపై, రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకెంత దారుణమైన దిస్థితికి దిగజారనుందో వివరిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖలు రాశాను. ఏపీలో ఆర్టికల్ 356ను అమలుచేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరాను. జగన్, సాయిరెడ్డిల ఆర్థిక నేరాలు, పెండింగ్ లో ఉన్న సీబీఐ చార్జిషీట్లపై నేను చేసిన ఫిర్యాదుకు రాష్ట్రపతి స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం శాఖకు సూచనలు వెళ్లాయి. ఇక్కడ మనం మరో కీలక అంశాన్ని చెప్పుకోవాలి..

చంద్రబాబు మజ్జిగ.. భారతి సిమెంట్
ఏపీలో సంక్షేమ పథకాలు అవసరమే, కానీ అందుకోసం ప్రజల ఆస్తుల్ని తెగనమ్మడం, దొంగతనంగా అప్పులు తేవడం ఏమాత్రం సబబు కాదు. పోనీ, తెచ్చిన అప్పులను సక్రమంగా వాడుతున్నారా అంటే అదీ లేదు. ప్రజాధనంతో వైసీపీకి కొమ్ముకాసే డిజిటల్ కార్పొరేషన్ లాంటివి పెట్టుకున్నారు. సాక్షి, వైసీపీలో పనిచేసే చాలా మందికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల డబ్బులు పంచుతున్నారు.
సోషల్ మీడియాలో నాలాంటి వాళ్లను తిట్టినందుకు డబ్బులు కూడా ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రభుత్వ ఆఫీసులకు మజ్జిగ సరఫరా చేసి కోట్ల రూపాయలు బిల్లులు తీసుకుందని ఆరోపించిన వైఎస్ జగన్.. ఇవాళ తన ప్రభుత్వంలో అమలవుతోన్న కొద్దో గొప్పో నిర్మాణాలకు తన భార్య వైఎస్ భారతి సారధ్యంలోని భారతి సిమెంట్ కంపెనీ నుంచి టన్నులకొద్దీ సిమెంటును వాడుతున్నారు. అంటే, చంద్రబాబు మజ్జిగ అమ్మి చేసిన తప్పునే జగన్ భారతి సిమెంటును అమ్ముకోవడం ద్వారా చేస్తున్నారు. ఒకప్పుడు మజ్జిగను విమర్శించిన మనం.. ఇవాళ సిమెంటును అమ్ముకోవడం న్యాయమా, కాదా ఆలోచించండి..

డీఫ్యాక్టో సీఎం సజ్జలకు నోటి దూల
జగన్ ప్రభుత్వానికి సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి నిజానికి రాష్ట్రానికి వాస్తవ ముఖ్యమంత్రి(డీఫ్యాక్టో సీఎం)గా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఎత్తిచూపిన, కార్పొరేషన్ల పేరుతో దొంగచాటుగా అప్పులు తెచ్చుకుంటోన్న వైనాన్ని ప్రశ్నించిన బీజేపీ నేతలను ఉద్దేశించి సజ్జల దారుణంగా మాట్లాడారు.
సీఎంకు సమాంతర స్థాయిలో ఉన్న సజ్జల లాంటి వ్యక్తి 'నోటి దూల' అనే పదం వాడటం ఎంత తప్పు? ఆ మాటను డీఫ్యాక్టో సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిజంగా కేంద్రం చేసే అప్పులు రాజ్యాంగ విరుద్ధమైనవే అయితే, వాటిలో అవకతవకలు ఉన్నాయని సజ్జల వారు ఆధారాలను బయటపెట్టాలి. అంతేగానీ నోటి దూలకు పోవడం సరికాదని గుర్తించండి..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications