నీట్ రద్దుతో విద్యార్థుల డిప్రెషన్ .. తల్లిదండ్రుల టెన్షన్!
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే NEET (National Eligibility cum Entrance Test) పరీక్ష నిర్వహిస్తారు. అలాంటి NEET చుట్టూ గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా ప్రభావం, అసమాన అవకాశాలు వంటి కారణాలతో "నీట్ రద్దు" డిమాండ్ చాలా కాలంగా బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా పేపర్ లీక్ వ్యవహారంతో నీట్ పరీక్షను రద్దు చేసింది.
నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులలో భయం
నీట్ పరీక్షను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో డిప్రెషన్‌ను, తల్లిదండ్రుల్లో తీవ్ర టెన్షన్‌ను పెంచుతోంది. వైద్య విద్య అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావించే సమాజంలో, NEET పరీక్ష విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేదిగా మారింది. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకుంటూ, కుటుంబాలకు దూరంగా ఉండి, తీవ్ర ఒత్తిడిలో చదువుతున్నారు. ఇప్పుడు పరీక్ష రద్దు, పునఃపరీక్షలు, న్యాయపోరాటాలు వంటి పరిణామాలు వారిలో భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి.

తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
అలాగే NEET-UG 2026లో తెలంగాణలో 73 వేలకుపైగా విద్యార్థులు నమోదు చేసుకోగా, సుమారు 71 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.పరీక్ష తర్వాత విడుదలైన కీలో తమకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉందని ఆనందంగా ఉన్న విద్యార్థులు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దుకు ఎన్‌టీఏ తీసుకున్న నిర్ణయం విని షాక్‌కు లోనయ్యారు. కొత్త పరీక్ష తేదీలను వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు తెలిపినప్పటికీ, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షించడం సరికాదని ఆవేదన
గత ఏడాది నుంచి శిక్షణ తీసుకున్నామని, కీ చూసి 600+ మార్కులు వచ్చే అంచనాతో ఆనందంగా ఉన్నామని, ఇప్పుడు రద్దు విని ఏం చేయాలో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోయారు. ఎక్కడో జరిగిన తప్పుకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షించడం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మానసిక స్థితి చాలా దిగజారిపోయిందని, ఈ నిర్ణయం వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్ ఇదే
ఈ రద్దు నిర్ణయం పిల్లలను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. పరీక్ష నిర్వహణలో ఎన్‌టీఏ వైఫల్యం బయటపడిందని, ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా రూట్ లెవెల్ నుంచి సరైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications