జగన్ చాలా ముందున్నారు - అమరావతిపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కేవలం ఉన్నతాధికారులకు, సంపన్నులకే సొంతమని మొదట్లో భావించిన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు..రూపాయికే కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం మిగిలిన అన్ని ప్రభుత్వాల కంటే ముందు ఉందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
అమరావతిలో నిర్ణయానికి మద్దతు : అమరావతిలో ఇంటి స్థలాలు..ఇళ్ల పైన ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విజయ సాయిరెడ్డి సమర్ధించారు. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులను పూర్తిగా అధిగమించే దశకు రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో పేద ప్రజలకు 30 లక్షల 60 వేల ఇళ్ల స్థలాల పట్టాలను జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైసీపీ వాగ్దానం చేసినట్టుగానే అధికారంలోకి వచ్చాక కేవలం రూపాయికే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇస్తోందని చెప్పారు. ఇంకా 21 లక్షల గృహాలు, సమస్త సౌకర్యాలతో 17 వేల ఇళ్ల కాలనీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని సాయిరెడ్డి వివరించారు. అమరావతిలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.

కొత్త అధ్యాయం మొదలైంది : అమరావతిలో పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించి ఆర్ 5 జోన్ ఏర్పాటు చేయడం ఏపీ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీసిందని విశ్లేషించారు. రాష్ట్ర రాజధాని కేవలం రాజ్యాధికారం ఉన్నవారిదో లేక ధనికులదో కాదని ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. రాజధాని అందరిదీ... రాజధానిలో సమానత్వానికే పెద్ద పీట వేస్తున్నామని ప్రకటించడం విప్లవాత్మక నిర్ణయంగా సాయిరెడ్డి అభివర్ణించారు. అవసరమైన పేదలకు నివాస స్థలాలు, అన్ని సౌకర్యాలతో కట్టిన గృహాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. అమరావతిలోని మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు ప్రాంతాల్లో సొంతిళ్లు లేని దాదాపు 50 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయంగా వివరించారు.
సీఎం జగన్ శంకుస్థాపన : నవరత్నాలలో భాగమైన పేదలందరికీ ఇళ్లు'కింద అమరావతిలో ఇళ్ల పట్టాలను ఆర్థికంగా బలహీనవర్గాలకు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని రెండు వేలకు పైగా గ్రామాల్లో ఇప్పటికే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. జూలై 8న సీఎం జగన్ అమరావతి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశం పైన స్థానిక రైతు జేఏసీ న్యాయపోరాటానికి సిద్దమైంది. ఇటు ప్రభుత్వం ఇళ్ల శంకుస్థాపనకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications