బహ్రెయిన్ లో శ్రీకాకుళం వాసుల నరకయాతన-రక్షించాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు సాయిరెడ్డి వినతి
ఏపీలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారు కరోనాతో పాటు వివిధ సమస్యల నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్ వెళ్లిన పలువురు శ్రీకాకుళం వలసదారులు నరకయాతన ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్ వెళ్లి అక్కడ వేధింపులు ఎదుర్కొంటున్న వారిని కాపాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విదేశాంగమంత్రి జై శంకర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోతో సహా పంచుకోవడంతో దీనిపై చర్చ మొదలైంది. బహ్రెయిన్ వెళ్లిన శ్రీకాకుళం వాసుల్ని అక్కడి ప్రభుత్వం, లేదా వారు పనిచేస్తున్న సంస్ధల సిబ్బంది దాడులు వేధించడం, గాయపరచడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అక్కడ వారు పడుతున్న నరకయాతన అర్ధమవుతోంది.

శ్రీకాకుళం జిల్లా నుంచి పొట్టకూటి కోసం బహ్రెయిన్ వెళ్లిన పేద కార్మికులను అక్కడ వారు పనిచేస్తున్న సంస్ధ తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫేస్ బుక్ వీడియోతో కోట్ చేసి చెప్పారు. సదరు సంస్ధలు శ్రీకాకుళం వారిని తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని వారిని రక్షించాలని విజయసాయిరెడ్డి విదేశాంగమంత్రిని వేడుకున్నారు. వేలాది మంది కార్మికుల్ని వారి స్వస్ధలాలకు తరలించేందుకు కేంద్ర ముందుకు రావాలని, ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు.
ఇప్పటికే కరోనా కారణంగా పలు గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయి, స్వదేశాలకు రాలేక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో బహ్రెయిన్ ఘటన ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని, స్ధానికుల్ని కలిచివేస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుని తమ కుటుంబ సభ్యుల్ని కాపాడాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications