నిమ్మగడ్డకు ఇంకో రెండు నెలలే: దెబ్బకు దెయ్యం: చంద్రబాబు స్లీపర్ సెల్స్: వైసీపీ ఎంపీ
అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్‌కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థుల ప్రచారంతో హీటెక్కాల్సిన వాతావరణం.. జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎడతెగకుండా కొనసాగుతోన్న పోరుతో రచ్చ రచ్చగా మారుతోంది. మంత్రుల వైఖరి, వారు తనపై చేస్తోన్న విమర్శలను తప్పు పడుతూ, ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకవంక లేఖాస్త్రాలను సంధిస్తోండగా.. దాన్ని ప్రతిఘటిస్తోంది జగన్ సర్కార్. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య జోరుగా మాటల యుద్ధం సాగుతోంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ పంచాయతీల కోసం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోండగా.. దాన్ని ఢీ కొనేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను సాగిస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఆయనకు ఉన్న పరిథులు, పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు చేస్తోన్న విమర్శలకు సమాధానాలను ఇస్తూనే తన జిల్లాల పర్యటనలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనల పట్ల వైఎస్సార్సీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి.. మరోసారి ఆయనపై ఆరోపణలు చేశారు. ఘాటుగా విమర్శలను సంధించారు. నిమ్మగడ్డను చంద్రబాబు ఆత్మగా అభివర్ణించారు. చంద్రముఖిగా మారిన చంద్రబాబు ఆత్మ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను సాగిస్తోందని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగాన్ని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. విధులను గాలికి వదిలేసిన ఆ ఆత్మ.. రాజకీయాలు మాత్రమే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. మరో రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుందని అన్నారు. ఎక్కువ రోజులు పదవిలో కొనసాగదనే సంకేతాలను సాయిరెడ్డి పరోక్షంగా పంపించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా సాయిరెడ్డి ఘాటుగా ఆరోపణలు చేశారు. గుళ్లు కూలగొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుందని చురకలు అంటించారు. రాష్ట్రంలో కొద్దిరోజుల కిందటి వరకూ యథేచ్ఛగా సాగిన దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసకర ఘటనలు హఠాత్తుగా ఎందుకు నిలిచిపోయాయని సాయిరెడ్డి ప్రశ్నించారు. పంచాయతీల్లో కులాలు, మతాలు, మధ్య, పేదల మధ్య చిచ్చుపెట్టడానికి అవసరమైన కొత్త అసైన్‌మెంటును చంద్రబాబు తన ఆత్మ నిమ్మగడ్డకు ఇచ్చి ఉంటాడని ఆరోపించారు. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదని సాయిరెడ్డి అన్నారు.