‘బాబూ డ్రామాలు ఆపు- అవినీతిపై పీఎంకి ఫిర్యాదు! ఏపీకి టీడీపీ, బీజేపీలతో తీరని అన్యాయం’
న్యూఢిల్లీ: ఏపీ సీఎం, టీడీపీ అధినేతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత మూడు రోజులుగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంపై వారు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేలా స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ చూపాలని కోరారు. సభలో ఆందోళనలను నియంత్రించి, అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూడాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు ద్వారా వద్ద ధర్నా చేశారు.

తీర్మానంపై పట్టువీడం
అన్నాడీఎంకే, ఇతర పార్టీల ఎంపీల ఆందోళనలతో పార్లమెంటు సమావేశాలు వాయిదా పడుతూ సాగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం పట్టుపడుతూనే ఉంటామని, కేంద్రంపై అవిశ్వాసం పెడుతూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని.

బాబు ద్రోహి.. టీడీపీ, బీజేపీల తీరని అన్యాయం
లోకసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ రోజైనా లోకసభలో అవిశ్వాసం తీర్మానం చర్చకు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. సభ ఆర్డర్‌లో లేదని ఒక వైపు వాయిదా వేస్తూనే.. మరో వైపు ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకుంటున్నదని అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏపీకి టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అన్న ద్రోహి చంద్రబాబేనని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

బాబు పర్మిషన్ అవసరం లేదు
మరో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మొదట తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. బాబుకు ఏపీ ప్రయోజనాలు పట్టవని, తన నీడని తానే నమ్మడని ధ్వజమెత్తారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఎవరినైనా కలుస్తానని, అందుకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని, ప్రతి రెండు, మూడేళ్లకోసారి భాగస్వామిని బాబు మారుస్తారని, ఆయనకు విలువల్లేవని మండిపడ్డారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు చంద్రబాబు వెనుకాడరని అన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేశానని విజయసాయి చెప్పారు.

చంద్రబాబు డ్రామాలు ఆపాలి
వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కాదని, ప్యాకేజీకి మొగ్గుచూపారని ఆరోపించారు. హోదాపై అసెంబ్లీలో ఒక్కసారి కూడా చంద్రబాబు మాట్లాడలేదని, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని రెండు చేతులు జోడించి స్పీకర్‌ను కోరామని వరప్రసాద్ చెప్పారు.

బాబులా చేయలేం
చంద్రబాబు మేడిపండులాంటి వారని, పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే ఉంటాయని మరో ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబులా తమకు లాలూచీ రాజకీయాలు చేయడం రాదని, నాలుగేళ్లుగా ఒకే మాట మీద ఉన్నామని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తాము పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్నామని చెప్పారు.అవిశ్వాసంపై పాలకులకు చిత్తశుద్ది లేదని తేలిపోయిందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. కాగా, అవిశ్వాసంపై లోకసభ సెక్రటరీకి వైసీపీ బుధవారం నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications