వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష భగ్నం: మిథున్, అవినాశ్‌ల ఆస్పత్రికి తరలింపు, మోడీపై సురవరం ఫైర్

Subscribe to Oneindia Telugu

  బలగాలను అడ్డుకొన్న వైయస్సార్‌సీపీ.. పరిస్థితి ఉద్రిక్తత...!

  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్‌ కాంగ్రెస్ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో బుధవారం పోలీసులు వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఆరోగ్యం బుధవారం తీవ్రంగా విషమించింది. దీంతో తక్షణమే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అందుకు ఎంపీలు నిరాకరించడంతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది.

  ysrcp mps health deteriorated: shifted hospital

  వైయస్సార్‌సీపీ నేతలు ప్రతిఘటిస్తున్నా.. దీక్షలోని ఎంపీలను బలవంతంగా అక్కడి నుంచి రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసు బలగాలను అడ్డుకోవడానికి వైయస్సార్‌సీపీ శ్రేణులు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తామని ఎంపీలు మిథున్, అవినాశ్ రెడ్డి చెప్పారు.

  వైసీపీ ఎంపీలకు సీపీఐ సంఘీభావం: మోడీపై సురవరం నిప్పులు

  ప్రత్యేక హోదా సాధన కోసం దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలకు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి బుధవారం సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న దీక్షాస్థలిని బుధవారం సందర్శించిన ఆయన.. ఎంపీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

  దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని అమలుచేయలేదన్నారు. కేంద్రం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిర్వహించిన బంద్‌లు, రైల్‌రోకోలు, దీక్షలతో ప్రత్యేక హోదా పోరాటం ఉధృతస్థాయికి చేరుకుందని అన్నారు.

  అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం అడ్డుకున్నదని దుయ్యబట్టారు. యావత్‌ రాష్ట్రం ఓ వైపు, బీజేపీ, ఎన్డీయే మరోవైపు నిల్చుని ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం గొప్ప విషయమని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MPs Mithun Reddy and Avinash Reddy on Wednesday shifted to hospital due to their health deteriorated.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి