'మోడీ గ్రాఫ్ తగ్గిందనే, జగన్ లైన్లోకి చంద్రబాబు, ఆ రోజు వైసీపీ ఎంపీల రాజీనామా'
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ ఇప్పుడు బాగా లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు తెలిసిందని, అందుకే ఆయన బీజేపీకి దూరం జరిగారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం అన్నారు. పార్టీ అధినేత జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తమకు బీజేపీతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు ఎగదాళి చేశారన్నారు. తాము రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా
ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలం అందరం రాజీనామా చేస్తామని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన రోజే రాజీనామా ఉంటుందన్నారు. టీడీపీ కూడా జత కలిస్తే, 25 మంది ఎంపీలం రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. దేశానికి మంచి సంకేతం వెళ్తుందన్నారు.

బీజేపీని కార్నర్ చేస్తాం
అవిశ్వాస తీర్మానం పైన బీజేపీని కార్నర్ చేస్తామని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల పాటు రెండు పార్టీలు (బీజేపీ, టీడీపీ) ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశాయని చెప్పారు. ఎవరు ఏం చెప్పినా, చివరకు ప్రజలే దేవుళ్లు అన్నారు. తమతో పాటు టీడీపీ, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ఇచ్చాయని, కాబట్టి అవిశ్వాసం చర్చకు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీతో లోపాయికారి ఒప్పందం లేదు
తాము అడిగే ప్రత్యేక హోదా న్యాయమైన కోరిక అని మేకపాటి చెప్పారు. తమకు బీజేపీతో ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేదని తేల్చి చెప్పారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందనే చంద్రబాబు పక్కకు తప్పుకున్నారన్నారు. తాము మాత్రం రాజీనామాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

హోదా విషయంలో జగన్ లైన్లోకి చంద్రబాబు
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కూడ క్రమంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వస్తున్నారని మేకపాటి చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూ వస్తున్నారన్నారు. తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తామని చెప్పారు. హోదా కోసం తాము నింతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు.

హోదా ఇచ్చే వారికే మద్దతు
ప్రత్యేక హోదా ఇచ్చే వారికే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తామని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీకి మంచి మెజార్టీ ఉన్నప్పటికీ (ఎంపీలు) ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారన్నారు. తమకు కనుక 20 మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా సాధించేవారమని చెప్పారు. అవిశ్వాసంతో ఏం అవుతుందని మొదట చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు జగన్ లైన్లోకి వచ్చారని, టీడీపీయే అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు.












Click it and Unblock the Notifications