చేయమంటే చేస్తా - వేరే ఇంఛార్జ్ ను నియమించుకోవచ్చు: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..!!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని..లేదంటే పార్టీ కోసం పాటుడపడతానని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. మైలరవంలో మంత్రి జోగి రమేష్.. వసంత కృష్ణ ప్రసాద్ మద్య విభేదాలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. అటువంటి అంశాలు తాము పార్టీలో చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. నియోజకవర్గంలోని ఇంటి పోరు సర్దుకుంటుందని భావించి తాను మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నానని వివరించారు.

ఇంఛార్జ్ ను నియమించుకోవచ్చంటూ
మైలవరం అభ్యర్ధిగా తనను మార్చాలనుకుంటే నియోజకవర్గానికి వేరే ఇంఛార్జ్ ను నియమించుకోవచ్చంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. కొత్త ఇంఛార్జ్ ను నియమిస్తే ఎన్నికలయ్యే వరకూ ఆ ఇంఛార్జ్ తో కలిసి తిరుగుతానని చెప్పుకొచ్చారు. త్వరలోనే పార్టీ అధినాయకత్వాన్ని కలిసి ఇదే విషయం చెబుతానని ఎమ్మెల్యే వెల్లడించారు. తనకు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఎమ్మెల్యే స్పష్టం చేసారు. సీఎం జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన తండ్రి వ్యాఖ్యలతో ఎమ్మెల్యే విభేదించారు.

జోగి రమేష్ వర్గంతో ఇబ్బందులపై
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ ఆ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా పైన గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జోగి రమష్ పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే, మైలవరంలో జోగి రమేష్ మద్దతు వర్గం పార్టీలో పని చేస్తోంది.

సీఎం నాయకత్వంలోనే అంటూ
అయితే, ఎమ్మెల్యేగా గెలుపొందిన సమయం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు సొంత పార్టీ నుంచే ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ గా ఉంది. ఈ సమయంలో..తన తండ్రి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే.. సీఎం జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేసారు. ఈ జిల్లాకు మంత్రి రోజా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో నియోజకవర్గంలో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications