సంక్రాంతి వేళ వైఎస్, జగన్ పై ఐవీఆర్ఎస్ కాల్స్..!
ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఏపీలో ప్రజలకు ఫోన్లు చేసి దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేయని తప్పులను చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక, ప్రజల్లో నిలదొక్కుకోలేక, ఈ ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చకపోవడంతో ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని రాజకీయ ఎజెండాగా మార్చుకున్నారని విమర్శించారు. అందుకే హిందువులను, హిందూ సంస్థలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారన్నారు.
చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయని శివశంకర్ రెడ్డి తెలిపారు. 2007లో వైయస్ రాజశేఖరరెడ్డి జీవో ఇచ్చి ఏడు కొండలు పూర్తిగా టీటీడీ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టంగా చెప్పారని, గుళ్లు, స్వామివారి విగ్రహాలు కూల్చింది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. రామతీర్థంలో రాముడి తల నరికిన వ్యక్తికి ఈ కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇచ్చిందని, దీన్ని బట్టి హిందువులను ఎవరు రెచ్చగొడుతున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.

రథం కాల్చిన ఘటనపై వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించారని, వైయస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఎన్ని గుళ్లు నిర్మించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వెల్లడించారు. కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు 40 గుళ్లు కూల్చితే, వాటిని జగన్ పునఃనిర్మించారన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ముందు జంతు కొవ్వు అన్నారని, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే... కాదు కాదు వెజిటబుల్ ఫ్యాట్ అంటున్నారని విమర్శించారు. తిరుమల కొండలో మద్యం సీసాలపై కూడా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయంగా వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని సనాతన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications