AP Assembly : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ-వైసీపీ ప్లాన్ రెడీ..!
ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు అసెంబ్లీ సమావేశం కాబోతోంది. రేపు ఉదయం అసెంబ్లీ, మండలి ఉమ్మడి సమావేశం జరగబోతోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఇందులో విపక్ష వైసీపీ వ్యూహం ఏంటన్నది తేలిపోయింది. ఇప్పటికే వైసీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ .. తమ ఎమ్మెల్యేలకు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు.
గత నెలలో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఈసారి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు ఆయనే స్వయంగా తెరదించారు. ఈసారి అసెంబ్లీ సమావేసాల తొలిరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వినుకొండ పర్యటనలో జగన్ స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీకి వెళ్లి ఏం చేయబోతున్నారో కూడా చెప్పేశారు.

సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా హాజరవుతారు. అయితే ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సస్పెండ్ చేస్తే సభను వదిలి వెళ్లిపోవాలనేది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది. అలాగే మంగళవారం ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని వెళ్లేందుకు జగన్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి మంగళవారం నుంచి సభకు ఎలాగో హాజరయ్యే అవకాశం లేదు.
గతంలో తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అదీ గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీకి మొహం చాటేయాలని నిర్ణయించుకున్న జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారని, అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన భయపడుతున్నారని సీఎం చంద్రబాబు నిన్న విమర్శించారు.












Click it and Unblock the Notifications