తొలి అడుగే వాయిదా- ఇలాగైతే ఎలా.. !!
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నిర్వహించ తలపెట్టిన ఉద్యమ బాటలో తొలి అడుగే వాయిదా పడింది.
ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించదలిచిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని వైసీపీ వాయిదా వేసుకుంది. 13వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వివరించింది.

డిసెంబర్ 11వ తేదీన అయిదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉండబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించదలిచిన చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఈ ఆందోళన కార్యక్రమాన్ని 13వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది.
కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీయడానికి ప్రజా సమస్యలపై ఉద్యమబాట పట్టాలంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినప్పటికీ- అది 13కు వాయిదా పడింది.
ఆందోళనల్లో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం అందజేస్తారు పార్టీ నాయకులు. 20,000 రూపాయల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమాలను నిర్వహిస్తారు.
పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళనల్లో భాగంగా డిసెంబర్ 27వ తేదీన ఎస్‌ఈ కార్యాలయాలు, డిస్కమ్‌ల సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందిస్తారు. కరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై జనవరి 3వ తేదీన పోరుబాట పట్టనున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలను అందిస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ నినదిస్తారు.












Click it and Unblock the Notifications