వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై వైసీపీ నిరసన: తగ్గించాలంటూ డిమాండ్: టీడీపీ కలిసొస్తుందా?
న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే- ఈ నెల ఆరంభంలోనూ వంటగ్యాస్ సిలిండర్లు అమాంతంగా పెరిగాయి. ఒక్కో సిలిండర్ ధరను 266 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు చమురు సంస్థలకు అనుమతిని ఇచ్చింది. ఆయిల్ కంపెనీలు పంపించిన ప్రతిపాదనలను కొద్దిసేపటి కిందటే ఆమోదించింది. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లకు ఈ పెంచిన రేట్లను వర్తింపజేసింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కనెక్షన్లపై మాత్రమే ఈ భారాన్ని మోపింది.

డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు యధాతథం.. 6న పెంపు
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల జోలికి మాత్రం వెళ్లలేదు. వాటి రేట్లల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. యధాతథంగా కొనసాగిస్తోంది. 14.2 కేజీల బరువు ఉండే గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్‌లో పాత రేటే కొనసాగుతోంది. డొమెస్టిక్ కేటగిరీలోని ఎల్పీజీ సిిలిండర్ ధర రూ.899.50 పైసలుగా ఉంది. కోల్‌కతలో 926 రూపాయలు, చెన్నైలో రూ.915.50 పైసలుగా ఉంటోంది. దీపావళి పండగ తరువాత.. అంటే ఈ నెల 6వ తేదీన గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

పెంపుదల పట్ల వైసీపీ నిరసన
కాగా- ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెంపుదల పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే సిలిండర్ల మీద ఆధారపడిన చిరు వ్యాపారులు చితికిపోయారని, చిన్న చిన్న హోటళ్లు మనుగడ సాగించలేకపోతున్నాయని చెబుతోంది. ఇలాంటి గడ్డు కాలంలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల రేటును ఏకంగా 266 రూపాయలకు పెంచడం వల్ల వ్యాపారులపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైసీపీ.

గృహావసరాలపైనా పెంపు..
దీపావళి పండగ తరువాత గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల పైనా కేంద్ర ప్రభుత్వం భారం మోపుతుందని, కనీసం 100 రూపాయల వరకు వాటి రేట్లను పెంచుతుందంటూ వస్తోన్న వార్తలు మధ్యతరగతి కుటుంబాల వారిని కలవరపాటుకు గురి చేస్తోందని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. అసలే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల వల్ల వాహనరంగం ఎదుర్కొంటోన్న అదనపు భారం ప్రభావం పరోక్షంగా సామాన్యులపై పడిందని, ఈ పరిస్థితుల్లో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచడం మంచిది కాదని తేల్చి చెబుతున్నారు.

పునరాలోచించండి.. తగ్గించేలా చర్యలు తీసుకోండి..
ఎల్పీజీ ధరల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి ట్యాగ్ చేశారు. దీపావళి పండగ సమయంలో కమర్షియల్ సిలిండర్ల రేట్లను పెంచడం వల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతారని, రోజువారీ వ్యాపారాలు మందగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ చమురు కంపెనీలను ఆదేశించాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు.

త్వరలో వినతిపత్రం..
దీనిపై వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు త్వరలోనే హర్దీప్ సింగ్ పురీని కలిసి వినతిపత్రం అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ లోక్‌సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డిలతో పాటు మరికొందరు ఎంపీలు- కేంద్రమంత్రిని కలుస్తారని చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా తమ నిరసన గళాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారని అంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. వైసీపీ ఎంపీలు హర్దీప్ సింగ్‌ను కలవడమంటూ జరిగితే- టీడీపీ ఎంపీలు కూడా వేరుగా వెళ్లి ఆయనకు వినతిపత్రం అందజేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications