ముసుగులో గుద్దులాటకు పుల్ స్టాప్- దసరా నాటికి ఛాప్టర్ క్లోజ్: రఘురామా
అమరావతి: ఊహించినట్టే- జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛాన్ని అందించి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు- ఆయనను శాలువ కప్పి సన్మానించారు. కుప్పం పర్యటనలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో- ఆయనను పరామర్శించడానికే పవన్ కల్యాణ్ ఆయన ఇంటి గడప తొక్కారని చెబుతున్నారు.

లాంఛనమే ఇక..
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య ఇక పొత్తులు లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తుల దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను మొన్నటివరకు పెద్దగా పట్టించుకోలేదు పవన్.

ముసుగులో గుద్దులాట..
ఇప్పుడా ముసుగులో గుద్దులాటకు పుల్ స్టాప్ పెట్టారు. ఏకంగా చంద్రబాబు ఇంటి గడప తొక్కారు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైందనే వాదనలు ఉన్నాయి. ఇదివరకు చంద్రబాబు బహిరంగ వేదికల ద్వారా స్వయంగా ఆహ్వానించినప్పటికీ పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు పొత్తుల దిశగా. ఇప్పుడా పరిస్థితికి ఆయన స్వయంగా తెర దించారు.

పొత్తుల సంకేతాలే..
కారణం ఏదైనప్పటికీ- చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లడం అనేది పొత్తుల సంకేతాలుగానే భావించాల్సి వస్తోందనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీమంత్రులు ఈ భేటీని తప్పుపట్టినప్పటికీ- ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోనట్టే కనిపిస్తోన్నారు ఆ ఇద్దరూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మహాకూటమిగా ఆవిర్భవించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ముందస్తుకూ..
అటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్- ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం కూడా ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ భేటీ కావడాన్ని ఆ కోణంలోనూ చూసే వారు లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు ఖాయం కానున్నందు వల్లే ఊహించిన దానికంటే వేగంగా పవన్ కల్యాణ్- చంద్రబాబు సమావేశం అయ్యారనీ అంటున్నారు.

దుష్టశిక్షణ తథ్యం..
ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వచ్చే విజయదశమి నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రజలు సరైన తీర్పును ఇస్తారనీ చెప్పారాయన. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడం శుభపరిణామంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఫాసిస్ట్ జీఓలపై సమష్టి పోరాటం అత్యవసరమని చెప్పారు. దసరా నాటికి దుష్టశిక్షణ తథ్యమని, మంచిరోజులొస్తోన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications