RRR: నాలుగేళ్ల తర్వాత ఏపీలో రఘురామ ఎంట్రీ ! జగన్ కు థ్యాంక్స్..
వైసీపీ నుంచి గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించి ఢిల్లీకే పరిమితమైన రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన ఇవాళ రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం రోడ్డు మార్గంలో స్వస్ధలం భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్ధాయికి చేరడానికి కారణమైన సీఎం జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

ఇవాళ రాజమండ్రికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి భీమవరం రోడ్డు మార్గాన వెళ్లేందుకు రఘురామ నాలుగు రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. అయితే గతంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఊహించి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పోలీసులకు నిబంధనల మేరకు వ్యవహరించాలని పక్కాగా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎంపీకి ఇవ్వాల్సిన భద్రత కల్పించాలని ఆదేశించింది. దీంతో రఘురామ ఎంట్రీకి ఆటంకాలు తొలిగాయి.
అయినా రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం రఘురామ ఎంట్రీ ఇచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగింది. రఘురామరాజు ఎయిర్ పోర్టు నుంచి బయిటికి రాగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రఘురామ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటికి రావడం, ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం జరిగిపోయాయి. ఈ సందర్భంగా తనకు ఈ నాలుగేళ్ల పాటు మద్దతు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు తనను ఈ స్ధాయికి తీసుకొచ్చినందుకు జగన్ కు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications