"కరప్షన్ కింగ్.. చంద్రబాబు: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి"
ప్లీనరీ సమావేశాలతో అధికార పార్టీ అవినీతిని కడిగిపారేయాలనే యోచనలో ఉంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ.
విజయవాడ: ప్లీనరీ సమావేశాలతో అధికార పార్టీ అవినీతిని కడిగిపారేయాలనే యోచనలో ఉంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ. ఈ మేరకు శనివారం నాడు ప్రారంభమయ్యే ప్లీనరీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు అవినీతి లెక్కలపై ఆ పార్టీ 'అవినీతి చక్రవర్తి' అనే పుస్తకాన్ని విడుదల చేయనుంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు అవినీతి రూ.3,75,008కోట్లకు చేరుకున్నదని ఆరోపిస్తూ.. సాక్ష్యాధారాలతో సహా దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. మొత్తం 56కుంభకోణాల లెక్కల్ని బయటకు తీసి దాని చుట్టూ రూ.3.75లక్షల కోట్ల మేర అవినీతి అల్లుకుపోయిందని పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్లీనరీ తొలి రోజైన శనివారం వైసీపీ అధినేత జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. నిజానికి గతేడాదే చంద్రబాబు 'అవినీతి చక్రవర్తి' పేరిట ఏడాది క్రితమే వైసీపీ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మరిన్ని అవకతవకల్ని, కుంభకోణాల్ని కూడా చేర్చి తాజా పుస్తకాన్ని ముద్రించారు.
కాగా, రాజధాని భూముల నుంచి విశాఖ భూముల వరకు చంద్రబాబు బినామీ భూ బాగోతాలకు అడ్డు అదుపూ లేకుండా పోయిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించిన సాక్ష్యాలన్ని అవినీతి చక్రవర్తి పుస్తకంలో ఉంటాయంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.. పుస్తకంలోని అంశాల గురించి ప్లీనరీకి హాజరయ్యే పార్టీ నేతలకు వివరించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications