నారా లోకేష్ బర్త్‌డే నాడు టీడీపీ మహిళా నేతకు కేక్ తినిపించిన వినుకొండ హత్య నిందితుడు
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాంతి భద్రతలు కరవయ్యాయని విమర్శించింది. రోజుకో హత్య, అత్యాచార ఘటనలు సంభవిస్తోన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వినుకొండలో పార్టీ నాయకుడు షేక్ రషీద్ హత్యోదంతం.. దీనికి పరాకాష్టగా పేర్కొంది.
దీనిపై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడికి దిగింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపాడని ప్రచారం చేసిన నీచ చరిత్ర వైఎస్ఆర్పీకి ఉందని, ఏది జరిగినా, ముందు టీడీపీ మీద తోసేస్తోన్నారంటూ ఆరోపించింది.

హతుడు షేక్ రషీద్, చంపిన షేక్ జిలానీ, ఇద్దరూ వైసీపీ వాళ్లేనని తేల్చి చెప్పింది. వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చెలామణి అవుతున్న వైసీపీ నేత పీఎస్ ఖాన్‌కు ప్రధాన అనుచరులుగా పేర్కొంది. ఆ పీఎస్ ఖాన్.. వైఎస్ జగన్‌కు ప్రధాన అనుచరుడని తెలిపింది. తప్పు చేసిన వాడిని కూడా కఠినంగా శిక్షించడం తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో అయిదు సంవత్సరాల పాటు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఈ వైసీపీ సైకోలకి పట్టిన మదాన్ని దించుతామని, గంజాయిని అరికట్టుతామని, వైసీపీ సైకోలు చేసే ఈ దారుణాలు ఆపుతామని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ ఇచ్చిన ఈ ప్రకటనపై వైఎస్ఆర్సీపీ స్పందించింది.
జిలానీని కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా అభివర్ణించింది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, టీడీపీ పెద్దల అండదండలతో ఇప్పుడు రాక్షసుడిలా మారి వైసీపీకి చెందిన రషీద్ నిండు ప్రాణం అత్యంత కిరాతకంగా తీశాడని పేర్కొన్నారు. టీడీపీ పెద్దలతో నిందితుడు జిలానీ తిరుగుతున్న ఫోటోలను వైసీపీ షేర్ చేసింది.












Click it and Unblock the Notifications