9న జగన్ పర్యటన వేళ.. వైసీపీ తాజా పోరు
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మరింత ఊపునిస్తోన్నాయి. సమాజంలోని అన్ని వర్గాలవారి మద్దతును కూడగట్టుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాలు సఫలమౌతున్నట్టు కనిపిస్తోన్నాయి.

తాజాగా నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇందులో మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షాలపై ఉంటుందని, సమాజం పట్ల అందరం బాధ్యత గల ప్రతి ఒక్కరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యం అనేవి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కుగా అభివర్ణించారు. రాజ్యాంగ విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిత్యం వాటిని పర్యవేక్షించారని కాకాణి గుర్తు చేశారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పారని, అయిదేళ్లలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొనివచ్చారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, మరో అయిదింట్లో అడ్మిషన్లు సైతం ప్రారంభం అయ్యాయని కాకాణి తెలిపారు. పీపీపీ రూపంలో చంద్రబాబు ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం బేరసారాలు చేస్తోందే తప్ప, విరమించుకోవట్లేదని ఆరోపించారు.
చంద్రబాబు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ఎకరం వంద రూపాయలకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని, ఎవరి ప్రలోభాలకు గురై ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ పరం చేసేందుకు ఆలోచన చేస్తున్నాడో అన్నది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్నగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, పోరాటాలు చేస్తే పోలీసులు షరతులు విధిస్తూ, నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications