మళ్లీ టీడీపీ, బీజేపీ దోస్తీ ? ఉమ్మడి టార్గెట్ పైనే దృష్టి-వైసీపీలో కలవరం అందుకేనా ?
ఏపీలో రాజకీయం మారుతోంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత గెలిచిన వైసీపీతో పాటు ఓడిన టీడీపీతోనూ సమదూరం పాటిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా రూటు మార్చుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ప్రధాన విపక్షంతో కలిసి సాగడమే మంచిదని భావిస్తున్న బీజేపీ నేతలు బహిరంగంగా ఆ మాట బయటపెట్టకుండానే చేయాల్సిందంతా చేసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో సహజంగానే వైసీపీలో కలవరం మొదలైంది. తాజాగా సజ్జలతో పాటు ఇతర వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శనం.

టీడీపీ, బీజేపీ పొత్తు కథ
గతంలో వాజ్ పేయ్ హయాంలో 1999లో ఏపీలో ఓసారి టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి. ఆ తర్వాత ఎన్నికల్లో ఈ పొత్తు ఫలించకపోవడంతో తిరిగి ఎవరి దారు వారు చూసుకున్నారు. మరోసారి 2014లో మోడీ ఎంట్రీతో మరోసారి బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరింది. అదే సమయంలో కొత్త పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తన జనసేనను కూడా వీరికి జత కలిపారు. ఫలితంగా 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే మూడేళ్లలోనే ఈ పొత్తు విఫలమైంది. వైసీపీ ఒత్తిడితో కేంద్రానికి గుడ్ బై చెప్పిన టీడీపీకి తాము చేసిన తప్పిదం తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంలో కేంద్రం నుంచి సహకారం లేకపోవడం కూడా ప్రధాన కారణమని భావించిన టీడీపీ మళ్లీ పునరాలోచనలో పడింది. అయితే బీజేపీ కూడా అంతే వేగంగా పునరాలోచనలో పడుతుందని భావించినా అది సాధ్యం కాలేదు.

బీజేపీ పొత్తుకు టీడీపీ అర్రులు
2019లో బీజేపీపై ధర్మపోరాటం చేసి దారుణంగా దెబ్బతిన్న టీడీపీకి ఆ తర్వాత జ్ఞానోదయమైంది. వెంటనే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెతను అందిపుచ్చుకుంటూ బీజేపీపై విమర్శలు చేయకుండా కలుపుకోవడం మొదలుపెట్టింది. అయితే పరిస్ధితిని గమనించిన బీజేపీ నేతలు మాత్రం గతానుభవాలతో టీడీపీనీ, చంద్రబాబును దూరం పెట్టారు. చివరికి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి అమరావతి రాజధాని వీరందరినీ కలిపింది.

విపక్షాల్ని కలిపిన అమరావతి
రాష్ట్రంలో విపక్షాలకు ప్రస్తుతం చెప్పుకోదగిన ప్రజా సమస్యలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా కదిలించే సమస్యలు లేవు. దీంతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా టీడీపీ చేస్తున్న పోరాటమే తిరిగి బీజేపీకి దిక్కయింది. దీంతో అమరావతి ఉద్యమంలో చేరాలని బీజేపీ అధిష్టానం నుంచి సూచనలు అందాయి. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ నేతలు అమరావతి పాదయాత్రకు మద్దతు ప్రకటించడంతో పాటు తిరుపతిలో జరిగిన అమరావతి సభలోనూ పాల్గొన్నారు. ఇదే సభలో మిగతా విపక్షాలు కూడా పాల్గొనడంతో విపక్షాల ఐక్యత కనిపించింది. ఇది అంతిమంగా వైసీపీకి హెచ్చరికలు పంపింది.

విపక్షాల ఐక్యతపై వైసీపీ విసుర్లు
తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో ఎప్పుడైతే విపక్షాలు ఎప్పుడూ లేనంత ఐక్యత ప్రదర్శించాయో అప్పుడే వైసీపీలో కలవరం మొదలైంది. తాము మౌనంగా ఉండిపోతే విపక్షాలు మరింత బలపడే అవకాశముందని వైసీపీ భావించింది. అంతే వెంటనే విపక్షాల ఐక్యతను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. భిన్న భావజాలాలు, సిద్ధాంతాలు కలిగిన విపక్షాలు ఎలా కలుస్తాయని వైసీపీ మొదలుపెట్టిన ప్రశ్నలు రోజురోజుకూ రాటుదేలుతున్నాయి. దీంతో విపక్షాలు కూడా అంతే వేగంగా వైసీపీని టార్గెట్ చేయటం ఆరంభించాయి.

మళ్లీ టీడీపీ, బీజేపీ పొత్తు ?
ఏపీలో గతంలో రెండుసార్లు కలిసి పనిచేసి రాజకీయ కారణాలతో విడిపోయిన టీడీపీ, బీజేపీ మళ్లీ చేరువవుతున్నాయి. అమరావతి నుంచి మొదలైన విపక్షాల ఐక్యత వీరి మధ్య పొత్తుకూ బాటలు వేస్తోంది. గతంతో పోలిస్తే టీడీపీ, బీజేపీ మధ్య మాటల దాడి తగ్గింది అదే సమయంలో అధికార వైసీపీ తమ ఇద్దరినీ టార్గెట్ చేస్తున్న వేళ.. వారిద్దరూ అవే విమర్శల్ని తిప్పికొట్టే పనిలో ఉన్నారు. అలాగే టీడీపీ స్క్రిప్ట్ ను బీజేపీ వాడుకుంటోందని వైసీపీ చేస్తున్న విమర్శలకు కాషాయ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో టీడీపీ, బీజీపీ బంధం ఎన్నికలకు ముందే బలోపేతం కాబోతోందన్న సూచనలు అందుతున్నాయి. అయితే పొత్తు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న దానిపై ఇప్పుడే క్లారిటీ రావడం లేదు. ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. దీంతో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల టార్గెట్ గా వీరిద్దరూ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగో టీడీపీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్న జనసేన కూడా బీజేపీని వీడకపోవడం వెనుక కూడా ఇదే కారణమై ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతోంది.












Click it and Unblock the Notifications