కూటమికి వైసీపీ మరో షాక్..? వైజాగ్ లోనూ కడప ఫార్ములా..!
ఏపీలో కూటమి ప్రభుత్వం 9 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. అదే సమయంలో విపక్ష వైసీపీపై పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల్లో ఫిరాయింపుల్ని తీవ్ర స్ధాయిలో ప్రోత్సహించడం ద్వారా వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం కారణంగా నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవకాశం లేకపోవడంతో సైలెంట్ గా ఉన్న కూటమి.. ఇప్పుడు ఆ గడువు పూర్తి కావస్తుండటంతో వరుసగా నోటీసులు ఇస్తోంది.
ఈ నేపథ్యంలో కడప జడ్పీ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ తాజాగా అక్కడి జడ్పీటీసీల్ని బెంగళూరు, హైదరాబాద్ కు తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇదే క్రమంలో ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మేయర్ సీటును కాపాడుకునేందుకు అక్కడి కార్పోరేటర్లను ప్రలోభాలకు దూరంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్లో పూర్తి మెజార్టీతో ఉన్న వైసీపీపై ఆధిపత్యం కోసం కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుంటున్న కూటమి పార్టీలకు దీంతో షాక్ తగిలినట్లయింది.

2021లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పోరేషన్లో 98 కార్పోరేటర్లకు గానూ వైసీపీ 59 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం స్ధానంలో కూటమి రావడంతో కార్పోరేటర్ల ఫిరాయింపులు మొదలయ్యాయి. కూటమి పార్టీల ప్రలోభాలతో వైసీపీ కార్పోరేటర్లు గీట దాటడం ప్రారంభించారు. తాజాగా ఆరుగురు కార్పోరేటర్లు ఇలా వైసీపీని కాదని టీడీపీ, జనసేనలో చేరిపోయారు. మరో ఆరుగురు గీట దాటితే మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడం ఖాయంగా మారింది. దీంతో అవిశ్వాసం కోరుతూ కలెక్టర్ కు నోటీసిచ్చారు.
ఈ నేపథ్యంలో తమ కార్పోరేటర్లను కాపాడుకునేందుకు కడప జడ్పీ తరహాలోనే బెంగళూరు క్యాంప్ కు వైసీపీ తరలించినట్లు తెలుస్తోంది. తద్వారా వారిని కూటమి పార్టీలు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మెజార్టీకి దగ్గరగా కార్పోరేటర్లు కూటమి పార్టీల్లోకి ఫిరాయించడంతో లెక్కలు క్షణక్షణానికి మారుతున్నాయి. తమకు పూర్తి మెజార్టీ వచ్చేసిందని తేలగానే గ్రేటర్ విశాఖ మేయర్ పై కూటమి అవిశ్వాసానికి కలెక్టర్ అనుమతిచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications