చదరపు అడుగు 11 వేలా ? సీఆర్డీయే భవనంపై వైసీపీ ఫైర్..!
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించిన సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంతో పాటు మున్సిపల్ భవనాల సముదాయాల నిర్మాణంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడా లేనంత వ్యయంతో సీఆర్‌డీఏ భవన నిర్మాణం జరిగిందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. అప్పులు చేసి అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమీషన్ల కోసం అంచనాలు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఆర్‌డీఏ భవనానికి చేసిన వ్యయమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనమన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయాలతో అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు దండుకుంటున్న కమీషన్ల దందా దాగి ఉందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సీఆర్‌డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి దీనిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఏకంగా చదరపు అడుగు రూ.11,0002.64 చొప్పున దాదాపు రూ.338.14 కోట్లతో సీఆర్‌డీఏ భవనాన్ని నిర్మించారని, దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగుళూరు, ముంబై వంటి చోట్ల, స్టార్ హోటళ్ళే చదరపు అడుగు గరిష్టంగా రూ.4500లకే నిర్మిస్తున్నారని గుర్తు చేశారు.

అంచనాలను పెంచడం, అందులో తమ వంతు ముడుపులను అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. సీఆర్‌డీఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే... అప్పుచేసి పప్పు కూడు, జనానికి క్షవరం అన్నట్లుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారేందుకు ఈ సీఆర్‌డీఏ భవనమే పెద్ద ఉదాహరణ అన్నారు. తొలిగా హెచ్‌ఓడి పేరుతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయని చెబుతున్నారని, సీఆర్డీఏ భవనంలో ఏ విభాగాలు పనిచేస్తాయి, అందులో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుతం వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారంటే సరైన సమాధానం లేదన్నారు.
రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెతను తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజల సొమ్ముతో అవసరానికి మంచిన సామర్థ్యంతో, రెట్టింపు అంచనాలతో భారీ భవనాలను నిర్మించి, తమ ఘనతగా చాటుకోవాలని చూస్తోందన్నారు. అనుత్పాదక వ్యయంగా ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. పైగా దీని నిర్వహణ కోసం అత్యధిక వ్యయాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందన్నారు. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియదా? దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదా అని ప్రశ్నించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు దీనిని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వ్యవహారంగా మార్చేశారన్నారు. అందుకే దేశంలో భవనాలు, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా భారీ వ్యయాన్ని కేటాయిస్తున్నారని తెలిపారు. అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని, అప్పులు చేసి రాజధాని పేరుతో భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ రుణభారాన్ని ప్రజల నెత్తిమీద రుద్దుతారన్నారు. ప్రతిసారీ తాను గొప్ప విజనరీనీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన కమీషన్లను పెంచుకోవడానికే, ఈ తరహాలో అంచనాలను పెంచి భారీ నిర్మాణాలను చేపడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications