ఉపరాష్ట్రపతి రేసులో వైసీపీ సపోర్ట్.. బీజేపీ వ్యూహానికి బలం!
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) తమ మద్దతును ప్రకటించింది. ఈ నిర్ణయం అధికారిక కూటమికి మరింత బలం చేకూర్చనుంది. విపక్ష కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ లోక్‌సభ ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మద్దతు కోరారు. ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో ఏడు కలిపి మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీ అధికారికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో లేదా విపక్ష 'ఇండియా' కూటమిలో భాగం కానప్పటికీ, రాష్ట్రంలో దాని ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉంది. పార్లమెంటు ఉభయ సభలలో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున, రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు, పవన్ టార్గెట్‌గా జగన్ పోరాటం చేస్తున్నారు. 2029 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉండడం గమనార్హం. ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణాలకు కీలకం కానున్నాయి. దీంతో, రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications