బాబు-పవన్ టూర్స్: వైసీపీకి కావాల్సినంత స్టఫ్ దొరుకుతోంది బాస్..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. జాయింట్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి పెట్టారు. చంద్రబాబు గురువారమే ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటనను ముగించుకోగా.. అదే రోజున వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో అడుగుపెట్టారు. జగదంబ జంక్షన్‌లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ ఇద్దరు నేతలు, వారు సారథ్యాన్ని వహిస్తోన్న పార్టీల లక్ష్యం ఒక్కటే- వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల బరిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం. ఇదే లక్ష్యంతో వారిద్దరూ రోడ్డెక్కారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో చంద్రబాబు, వారాహి పేరుతో పవన్ కల్యాణ్.. రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర దీనికి బోనస్.

ఆయా పర్యటనల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తోన్న ప్రసంగాలు.. రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోన్నాయి. తెలిసి చెబుతున్నారో.. తెలియక చేస్తోన్నారో అర్థం కావట్లేదు గానీ- వారి ప్రసంగాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి కావాల్సినంత స్టఫ్‌ను ఇస్తోన్నాయనేది సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది.
హైడ్రోజన్ నుంచి కరెంటును, మళ్లీ అదే కరెంటు నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో ట్రోల్స్ చేసిందో తెలిసిన విషయమే. సౌర విద్యుత్‌కూ తానే నాంది పలికానంటూ చంద్రబాబు చెప్పడం, దాని తాలూకు థంబ్ నైల్స్‌కు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో లాఫింగ్ ఎమోజీలు పోటెత్తాయి.
తాను అధికారంలోకి వస్తే ప్రతి సబ్ స్టేషన్‌లోనూ ప్యానెల్స్ పెట్టి సోలార్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని సొంత పార్టీ నాయకులే జోక్‌గా తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా ఎక్కడికక్కడ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, సర్‌ప్లస్ పవర్ సాధిస్తానని, దీనివల్ల యూనిట్ రెండు-మూడు రూపాయలకే సరఫరా చేస్తానని టీడీపీ చీఫ్ చెప్పడం హాస్యాస్పదంగా అభివర్ణిస్తోన్నారు.

గురువారం రాత్రి విశాఖ జగదాంబ జంక్షన్‌లో వారాహి పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపైనా అదే స్థాయిలో నవ్వుకుంటోన్నారు వైసీపీ అభిమానులు. కేంద్రంతో చెప్పి- జగన్‌ను ఒక ఆట ఆడిస్తానంటూ పవన్ చెప్పడంపై సెటైర్ల దాడిని మొదలుపెట్టారు. మా అమ్మతో చెప్పి నిన్ను కొట్టిస్తా.. అంటూ చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్టుగా ఉందని తీసి పారేస్తోన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి రవాణాకు విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అప్పట్లో ఎవరిని ప్రశ్నించావంటూ వైసీపీ అభిమానులు ప్రశ్నలు సంధిస్తోన్నారు పవన్ కల్యాణ్‌పై. నారా లోకేష్ తోడల్లుడు భరత్ చౌదరికి చెందిన గీతం యూనివర్సిటీ.. ఎండాడ, రిషికొండ పరిధిలోని రూ.1,000 కోట్ల విలువైన 40.41 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నప్పుడు ఏమయ్యావని ప్రశ్నిస్తోన్నారు.












Click it and Unblock the Notifications