'అన్నదాత సుఖీభవ' అమలు వారికే- బడ్జెట్ లో క్లారిటీ..!!
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కు భారీగా కేటాయింపులు ప్రతిపాదించారు. అయితే, అన్నదాత సుఖీభవ అర్హులు.. కావాల్సిన నిధులు.. బడ్జెట్ లో కేటా యింపులు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఈ పథకం అమలు లోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్ లో కేటాయింపులు
ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ లో రైతులకు ఇచ్చిన హామీ అమలు దిశగా కేటాయింపు లు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ 20 వేలు చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ఏడాది ఈ సాయం రైతుల కు అందలేదు. 2025-26 ఆర్దిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ లో ఈ మేరకు నిధులను కేటాయించింది. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో ఇందు కోసం రూ 9,400 కోట్లు ప్రతిపాదించింది. కాగా, వైసీపీ చెబుతున్న లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

వైసీపీ లెక్కలు
మాజీ మంత్రి బొత్సా ఈ పథకం కేటాయింపుల పైన స్పందించారు. అన్నదాతా సుఖీభవ అమలు కు కావాల్సింది రూ.10,717 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో తక్కువగా కేటాయింపులు చేసారని విమర్శించారు. 52 లక్షల మంది రైతులు ఉండగా.. ప్రభుత్వ కేటాయింపుల్లో అందరికీ న్యాయం దక్కదనే అనుమానం వ్యక్తం చేసారు. అదే విధంగా పెన్షన్ల నిధుల్లోనూ కోత విధించటం పైన కొత్త అనుమానాలు లేవనెత్తారు. తల్లికి వందనం కింద 81 లక్షల మంది విద్యార్ధులకు రూ 12 వేల కోట్లు అవసరమని వివరించారు. బడ్జెట్ లో తల్లికి వందనం కోసం రూ 9, 407 కోట్లు కేటాయింపు చేయటం ద్వారా అందరికీ ఈ పథకం అమలు చేయటం పైన అనుమానం వ్యక్తం చేసారు.
మూడు విడతల్లో
గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో రూ.3000 కోట్లు మార్కెట్ ఇంట్రవెన్షన్ కింద నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని బొత్సా గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించటం పైన ప్రశ్నించారు. ఇక.. కూట మి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ పథకంలో కింద అందుతున్న రూ 6 వేలు మినహాయించి.. లబ్దిదారులకు రూ 14 వేలు చొప్పున మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ పథకం అమలు మార్గదర్శకాల ఖరారు పైన రైతులు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అందరికీ ఈ పథకం అమలు చేస్తామని భరోసా ఇస్తోంది.












Click it and Unblock the Notifications