వైసీపీ టార్గెట్ ఫిక్స్- ఇంకొక్క రోజే బాకీ !!
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తన పోరాటాలను మరింత తీవ్రతరం చేసింది. వరుస ఆందోళనలకు పిలుపునిస్తోంది.
ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు ఆందోళనను నిర్వహించనుంది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు ఈ మేరకు ఈ నిరసనల కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ప్రభుత్వ విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించాయి.

ఏడాదిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు ఈ నిరసన చేపట్టనున్నాయి. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఫీజురీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. సూపర్ సిక్స్.. అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోందని మండిపడుతోంది.
ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతినెలా 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీనీ విస్మరించడం సరికాదని, కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. సకాలంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని ఆరోపిస్తోంది.
నిజానికి ఈ నెల 13వ తేదీన జరగాల్సిన ఆందోళన ఇది. అంతకుముందు రోజే అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాదం సంభవించిన నేపథ్యంలో.. దీన్ని వాయిదా వేసింది. తాజాగా ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయించింది. ఈ 23వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలను చేపట్టనుంది.
దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 23వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
స్థానిక కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి యువతను మోసగించి ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ యువతకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications