కొమ్మినేని ఎపిసోడ్ లో మరో ట్విస్ట్..! మళ్లీ సుప్రీంకు వైసీపీ ?
ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన వ్యవహారంలో అరెస్టు అయి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కొమ్మినేనిపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ ను ఉద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడటం హేయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. కొమ్మినేని విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. డిబేట్‌లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసిందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పొన్నవోలు తెలిపారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడం లేదన్నారు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

హోంమంత్రి అనిత వ్యాఖ్యలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయని పొన్నవోలు తెలిపారు. ఈ కేసు ఇంకా ముగిసిపోలేదని, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడ్డం చట్ట విరుద్ధం అన్నారు. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతుందన్నారు. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్నారు. కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రిగారికి పంపిస్తానన్నారు.












Click it and Unblock the Notifications