ఆర్టీసి చార్జీల పెంపుపై ఆందోళన: 26న జగన్ పార్టీ ధర్నాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) బస్సు చార్జీల పెంపుపై శనివారం రాష్ట్రంలో ఆందోళనలు పెల్లుబుకాయి. రాష్ట్రంలోని పలు చోట్ల వామపక్షాలు ఆందోళనకు దిగాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి డిపోల ముందు ధర్నాలు నిర్వహించనుంది.
ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి లోగా పెంచిన ఆర్టీసి చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించకపోతే 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు శనివారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దానికి ఇక్కడ డీజిల్ ధరలు తగ్గుతున్నా కూడా ఆర్టీసి చార్జీలు ఎందుకు పెంచారో ఆర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రజలను దోచుకోవాలనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఆర్టీసి చార్జీలను పెంచబోమని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, ఇప్పుడు మాత్రం సంస్థకు నష్టాలు వచ్చాయనే సాకుతో చార్జీలు పెంచారని ఆయన అన్నారు. ఆర్టీసి నడిపించే సామర్థ్యం ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే నష్టాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రైవేట్ యాజమాన్యాలకు విచ్చలవిడిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం వల్ల ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటే వాటివైపే ప్రజలు మొగ్గు చూపుతారని ఆయన అన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలన్నీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు బినామీ సంస్థలేనని, అందుకే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications