Visakhapatnam East Constituency: టీడీపీ కంచుకోటలో ఈసారైనా వైసీపీ బోణీ కొడుతుందా?
ఏపీలో రాజకీయంగా యాక్టివ్ గా ఉండే విశాఖ నగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కూడా ఒకటి. కాబోయే రాజధానిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాంతంలో వైసీపీ బోణీ ఇప్పటివరకూ కొట్టని నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకూ విపక్ష టీడీపీ హవాయే కొనసాగుతోంది. దీన్ని బద్దలు కొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖపట్నం లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పూర్తిగా అర్బన్ సీటు. ఇక్కడ 2.72 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో కుల సమీకరణాలను చూసుకుంటే యాదవుల జనాభా ఎక్కువ. ఆ తర్వాత స్దానాల్లో తూర్పు కాపు, మత్సకార, బ్రాహ్మణులు, ముస్లింలు ఉంటారు. అయితే వీరి తర్వాత స్ధానంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఇక్కడ రెండు దశాబ్దాలుగా తన హవాను కొనసాగిస్తోంది.

ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికలు (2009, 2014, 2019)లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబే గెలిచారు. తద్వారా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు విశాఖ తూర్పు సీటులో ఆయనకు పోటీగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపేందుకు వైసీపీ సిద్దమవుతోంది. అయితే గతంలో పోటీ చేసి ఓడిపోయిన విజయనిర్మల వర్గం నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.
గత మూడు ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధిపై ఓసారి, వైసీపీ అభ్యర్ధులపై రెండుసార్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రామకృష్ణబాబు.. 26,474 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేనకు ఈ ఎన్నికల్లో 17, 873 ఓట్లు వచ్చాయి. మరోవైపు వైసీపీ ఇక్కడ గత రెండుసార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు. ఈసారి వైసీపీ నేతలు సమష్టిగా పనిచేస్తే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు.












Click it and Unblock the Notifications