పండగ వేళ పల్నాడు లో హై టెన్షన్.. పిన్నెల్లి లో వైసీపీ నేత మర్డర్!
సంక్రాంతి పండుగ సంబరాలు సాగాల్సిన వేళ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం హైటెన్షన్‌కు కేంద్రబిందువుగా మారింది. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్ చికిత్స పొందుతూ మృతి చెందడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలకు మరో రక్తపాత అధ్యాయం జతకలిసినట్టైంది.
పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచే వైఎస్సార్‌సీపీకి కట్టుబడి పనిచేసిన కార్యకర్త. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టీడీపీ నేతలు ఊరు విడిచిపోవాలంటూ బెదిరింపులకు దిగడంతో, ప్రాణభయంతో సాల్మన్ కుటుంబంతో కలిసి బ్రహ్మణపల్లికి వలస వెళ్లాల్సి వచ్చింది. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ తలెత్తుతున్నాయన్న ఆరోపణలు అప్పటినుంచే వినిపించాయి.

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెప్పడంతో రెండు నెలల క్రితం కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే టీడీపీ నేతలు, వారి అనుచరులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయితీ అనంతరం సాల్మన్‌ను ఊర్లోకి అనుమతించకుండా, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచే పిన్నెల్లిలో రాజకీయ వేడి తగ్గలేదు.
ఇటీవల సాల్మన్ భార్య అస్వస్థతకు గురికావడంతో, ఈ నెల 10వ తేదీన ఆమెను చూడటానికి పిన్నెల్లికి వచ్చిన సాల్మన్‌పై టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు. 'రావొద్దన్నా ఎందుకు వచ్చావ్' అంటూ చితకబాదినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన సాల్మన్‌ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న సమయంలో కోమాలోకి వెళ్లాడు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సాల్మన్... ఈ ఉదయం కన్నుమూశాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
సాల్మన్ మృతి విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు.
"పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ ను తెలుగుదేశం నాయకులు హత్య చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటికి వెళ్లిపోయాయి. సాల్మన్ కూడా బయటికి వెళ్లి బతుకుతున్నాడు. భార్య కు అనారోగ్యంగా ఉంటే సాల్మన్ ఆమెతో మాట్లాడడానికి పిన్నెల్లి గ్రామానికి వెళ్ళాడు. తెలుగుదేశం నాయకులు గ్రామంలో వచ్చిన సాల్మన్ పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజులు పాటు హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలుగుదేశం నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాల్మన్ పైనే కేసు పెట్టారు. తెలుగుదేశం నాయకులు సాల్మన్ ను హత్య చేయడానికి ప్రయత్నిస్తే సీఐ పనికిమాలిన సెక్షన్స్ పెట్టాడు" - కాసు మహేష్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే, గురజాల.
ఇక సాల్మన్ అంత్యక్రియలను పిన్నెల్లిలోనే నిర్వహిస్తామని కాసు మహేష్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌లు మీడియా ముందు నీతులు చెప్పడం కాదు... పల్నాడు ఫ్యాక్షన్, పిన్నెల్లి గ్రామంపై జరిగిన దౌర్జన్యాలపై మాట్లాడాలి అంటూ మహేష్ రెడ్డి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications