వారి చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం: విశాఖపట్నంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులను తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఉదయం విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ జంక్షన్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎనిమిది మంది విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తోన్న ఓ ఆటోను వేగంగా ఢీకొట్టిందో లారీ. లారీ ఢీ కొట్టిన వెంటనే ఆటోలో నుంచి విద్యార్థులు ఎగిరి పడ్డారు. వారి స్కూల్ బ్యాగ్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ఆటో నుజ్జునుజ్జు అయింది.

ఈ ఘటనలో హాసిని ప్రియా, జీ గాయిత్రి, వాణి జయ రమ్య, భావేష్, లక్ష్య, చార్విక్, కుశాల్, కేయూష్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అధునాతన అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారందరూ బెథనీ స్కూల్ విద్యార్థులు.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన తరువాత వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వ భరిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని రవాణా, ట్రాఫిక్ విభాగం అధికారులకు ఆదేశించామని అన్నారు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం.. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బెథనీ స్కూల్ యాజమాన్యానికి బస్సులు కూడా ఉన్నాయని, ఆ సంఖ్యను పెంచాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అప్పుడే తల్లిదండ్రులు ఇలా ఆటోల్లో విద్యార్థులను స్కూళ్లకు పంపబోరని చెప్పారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం ఉందని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications