ఏపీలో టెన్షన్, టీడీపీ-టీఆర్ఎస్ ఫిక్సింగ్, మంత్రి సతీమణి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు స్థానిక సంస్థలకు ఆధివారం పాలక మండళ్ల నియామకం జరుగుతోంది. జూలై 3న మున్సిపల్, 4న మండల పరిషత్, 5న జిల్లా పరిషత్‌లకు రెండు రాష్ట్రాల్లోను పాలక మండళ్ల నియామకం కోసం ఎస్ఈసీ షెడ్యూల్ జారీ చేసినా.. రెండు రాష్ట్రాల్లోను వివిధ కారణాలతో కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
తాజా షెడ్యూల్ నేపథ్యంలో ఏపిలోని ప్రకాశం, నెల్లూరు జెడ్పీ, జమ్మలమడుగు మున్సిపాల్టీ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా డెజ్పీ, సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు ఇరు రాష్ట్రాల్లోను పలు మండలాలు, కొన్నిచోట్ల ఉపాధ్యక్ష వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జమ్మలమడుగులో 144వ సెక్షన్ విధించారు.

జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులకు సమానంగా ఓటుల రావడంతో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్‌గా తులశమ్మ (వైయస్సార్ కాంగ్రెస్) ఎన్నికయ్యారు. జమ్మలమడుగులో చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రావారిపాలెం ఎంపీగా రేవతి (వైయస్సార్ కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
సూర్యాపేట
నల్గొండ జిల్లా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీలను తలదన్ని ఎన్నికల్లో నలుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్న తెరాస చైర్మన్ పదవి దక్కించుకుంది. 11వ వార్డు కౌన్సిలర్ గండూరు ప్రవల్లిక సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 34 మంది కౌన్సిలర్లలో తెరాస అభ్యర్థి ప్రవల్లికకు 21మంది మద్దతు లభించింది. వైస్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి నేరెళ్ల లక్ష్మీ ఎన్నికయ్యారు.
రంగారెడ్డిలో అవగాహన
రంగారెడ్డి జిల్లాలో టీడీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో అవగాహన కుదిరింది. టీడీపీ జెడ్పీటీసీలు తెరాస చైర్మన్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. దీంతో మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి సునితా రెడ్డి చైర్మన్ కానున్నారు. వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
నెల్లూరులో రగడ
నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీ సమావేశ మందిరంలో వైయస్సార్ కాంగ్రెసు, టీడీపీ సభ్యుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. కావలి జెడ్పీటీసీ సభ్యుడిని తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని జగన్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. సమావేశ మందిరం అరుపులు, కేకలతో గందరగోళంగా మారింది.












Click it and Unblock the Notifications