గుండెపోటుతో డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన డ్రైవర్-క్షణాల్లో దూకి బస్సు ఆపిన కండక్టర్..!
కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ బస్సు కండక్టర్ సమయస్పూర్తి అందులో ప్రయాణిస్తున్న దాదాపు 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అంతే క్షణాల్లో సీట్లోనే కూర్చుని కుప్పకూలిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా ఓ క్షణం ఏమీ అర్ధం కాలేదు. కానీ వెంటనే తేరుకున్న కండక్టర్ వేగంగా స్పందించాడు.
నీలమంగళ నుంచి యశ్వంత్ పూర్ వెళ్తున్న బీఎంటీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కిరణ్ కు దారిలో గుండెపోటు వచ్చింది. బస్సు ఆపేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన వెనుక కూర్చొన్న కండక్టర్ వెంటనే స్పందించాడు. పరిస్ధితి అర్ధం చేసుకొని వెంటనే అతని పక్కన వెళ్లి బస్సును ఆపాడు. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.

బీఎంటీసీలో పనిచేస్తున్న డ్రైవర్లలో చాలా మంది ఒత్తిడి కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ చనిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కర్నాటకలోని సత్యజయదేవ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులార్ సైన్సెస్ తో చేయించిన అధ్యయనంలో బీఎంటీసీకి చెందిన 7635 మంది డ్రైవర్లలో 45-60 ఏళ్ల మధ్య ఉన్న 40 శాతం మంది డ్రైవర్లు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా డ్రైవర్ మరణం చోటు చేసుకోవడంపై ఇతర ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.












Click it and Unblock the Notifications