కర్ణాటకలో మకాం వేసిన సోము వీర్రాజు, బండి సంజయ్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు, రామనగరల్లో రోడ్ షో, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడే మకాం వేశారు.

ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం ఇదే కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌కు స్టార్ క్యాస్ట్ తోడయింది. శాండల్‌వుడ్ సూపర్ స్టార్స్ ఈ రెండు పార్టీల తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్నారు. కిచ్చా సుదీప్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్- బీజేపీ తరఫున ప్రచారం సాగిస్తోన్నారు.
సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ఆయన భార్య గీత శివరాజ్ కుమార్- కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఎన్నికల బరిలోకి దిగారు. వీరసింహారెడ్డిలో విలన్‌గా నటించిన కన్నడ స్టార్ హీరో దునియా విజయ్‌తో పాటు ప్రముఖ నటి రమ్య సైతం కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తోన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తోన్న వరుణ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ కూడా కర్ణాటకలోనే మకాం వేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం సాగిస్తోన్నారు. ఏపీ- కర్ణాటక సరిహద్దు జిల్లాలైన కోలార్, చిక్‌బళ్లాపుర నియోజకవర్గాల్లో సోము వీర్రాజు, తెలంగాణ-కర్ణాటక సరిహద్దు జిల్లాలైన బీదర్, కలబురగి, విజయపుర జిల్లాల్లో బండి సంజయ్ ప్రచారం చేస్తోన్నారు.
కోలార్ జిల్లా శ్రీనివాసపురం నియోజకవర్గం పరిధిలోని చిల్లార్‌హళ్లిలోని సోమువీర్రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమావేశం నిర్వహించారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గుంజనూరు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తోన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం ఇది. ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇప్పుడు కూడా ఆయనే పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications