బటన్ నొక్కి.. నిధులను విడుదల చేసిన సిద్ధరామయ్య..!!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు కీలకమైనవి. అందులో ఒకటి- అన్నభాగ్య పథకం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రతినెలా 10 కేజీల ఉచిత బియ్యం సరఫరా. ఈ పథకం ఆరంభమైంది. ఈ సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకంలో చిన్న మార్పు చేసింది సిద్ధరామయ్య సర్కార్. 10 కేజీల ఉచిత బియ్యాన్ని అయిదు కేజీలకు కుదించింది. అయిదు కేజీల ఉచిత బియ్యాన్ని అందించడంతో పాటు మరో అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసేలా మార్పులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు.

ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ పంపిణీ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా అన్నభాగ్య పథకాన్ని అమలు చేయడానికి చాలినంత బియ్యాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం సేకరించలేకపోతోంది.
అందుకే అయిదు కేజీల బియ్యంతో పాటు మిగిలిన అయిదు కేజీలకు సమానమైన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు బదలాయించేలా అన్నభాగ్య పథకంలో మార్పులు చేసింది. దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. అన్నభాగ్య పథకం లోగోను ఆవిష్కరించారు.

అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తం 170 రూపాయలు. ఈ మొత్తం.. వచ్చే 15 రోజుల్లోగా లబ్దిదారుల అకౌంట్లకు బదిలీ అవుతుంది. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలోని 4.42 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోన్నామని అన్నారు. ఇప్పటికే కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు.
గతంలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.. దేశంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసిందని, దీన్ని మోదీ సర్కార్ నీరుగారుస్తోందని సిద్ధరామయ్య విమర్శించారు. ఈ చట్టం కింద దేశ ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం- రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం వినియోగించుకుంటోందంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications