Karnataka Polls : ఆ మాజీ సీఎంకు 99 శాతం టికెట్ ఖాయం ! యడియూరప్ప కీలక సంకేతం..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాపై యడియూరప్ప మార్క్ కనిపించింది. పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించడంతో మొదలుపెడితే మాజీ సీఎం, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన జగదీష్ షెట్టార్ వంటి వారికి టికెట్ నిరాకరించడంపైనా చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం తమ టికెట్ల జాబితాను సమర్ధించుకుంటోంది. ఈ నేపథ్యంలో పలువురు టికెట్ రాని నేతలు పార్టీని సైతం వీడుతున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన తొలి విడత అభ్యర్ధుల జాబితాలో సీటు దక్కించుకోని మాజీ సీఎం జగదీష్ షెట్టార్ అసంతృప్తిని గమనించిన అధిష్టానం.. ఆయన్ను ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరుపుతోంది.

ఈ నేపథ్యంలో షెట్టార్ కు 99 శాతం సీటు ఖాయమని సీట్లను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత యడియూరప్ప వెల్లడించారు. మే 10న జరిగే కర్నాటక ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో హుబ్బళ్లి-ధార్వాడ్ నియోజకవర్గం నుంచి జగదీష్ షెట్టార్ కు టికెట్ లభించలేదు.
ఈ నేపథ్యంలోనే చివరి నిమిషం వరకూ టికెట్ కోసం ఎదురుచూసిన షెట్టార్ పార్టీ జాతీయ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను ఢిల్లీ పిలిపించారని ఆయనే స్వయంగా వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షెట్టార్ ను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా కేబినెట్ పదవి లేకపోయినా తాను పార్టీ కోసం నిజాయితీగా పనిచేశానని షెట్టార్ తెలిపారు. కాబట్టి అధిష్టానం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు షెట్టార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications