పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తి: ఈడిగ సంప్రదాయం ప్రకారం..ఖననం
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం పూర్తయింది. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియల ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు మంత్రులు, కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, తోటి నటీనటులు హాజరయ్యారు.

ఈడిగ సంప్రదాయం ప్రకారం..
రాజ్‌కుమార్.. ఈడిగ కులస్తులు. ఈ సంప్రదాయం ప్రకారం- పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. కంఠీరవ స్టూడియోలో.. తండ్రి రాజ్‌కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని తెల్లటి వస్త్రంలో ఉంచి- దాన్ని గొయ్యిలోకి దించారు. కుటుంబ సభ్యుల చివరి చూపు అనంతరం ఖననం చేశారు. గంట వ్యవధిలో అంత్యక్రియల ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. 8 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు.

పోలీసుల గౌరవ వందనం..
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను చేపట్టినందున పోలీసులు గౌరవ వందనం చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి సంతాపం తెలిపారు. పునీత్ పార్థివదేహంపై కప్పి ఉంచిన జాతీయ పతాకాన్ని బసవరాజ్ బొమ్మై.. భార్య అశ్విని రేవంత్‌కు అందజేశారు. ఈడిగ సంప్రదాయం ప్రకారం.. అంత్యక్రియలు మొదలయ్యాయి. పార్థివదేహానికి విభూతిని పూశారు. ఈ కార్యక్రమాలన్నీ వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా సాగాయి.

పోటెత్తిన అభిమానులు..
ఈ ఉదయం కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలను నిర్వహిస్తారనే సమాచారం ముందే ఉండటంతో- అభిమానులు అక్కడికి పోటెత్తారు. కంఠీరవ స్టూడియో పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రం అయ్యాయి. లక్షలాదిమంది అభిమానులు కంఠీరవ స్టూడియోకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అపార్ట్‌మెంట్లు, చెట్లపైకి ఎక్కి అంత్యక్రియల ప్రక్రియను వీక్షించే ప్రయత్నం చేశారు. కంఠీరవ స్టూడియోకు వెళ్లే మార్గాలన్నీ అభిమానులతో నిండిపోయాయి. పవర్ స్టార్ నినాదాలతో స్టూడియో పరిసరాలు మారుమోగిపోయాయి.

ఆలస్యం చేయకూడదనే కారణంతో..
ఈ రెండు రోజుల్లో లక్షలాది మంది అభిమానులు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని సందర్శించారు. తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికా నుంచి పెద్ద కుమార్తె కూడా శనివారం సాయంత్రం తండ్రి పార్థివదేహానికి నివాళి అర్పించారు. దీనితో ఇక ఆలస్యం చేయకూడదనే కారణంతో- అంత్యక్రియలను వేగంగా పూర్తి చేశారు. తెల్లవారు జామున 4:30 నుంచి 5 గంటల వరకు అంతిమయాత్ర ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్థివదేహం కంఠీరవ స్టూడియోకు చేరుకున్న తరువాత.. ఖనన ప్రక్రియను అదే వేగంగా పూర్తి చేశారు. ఈ ఉదయం 10:30 గంటలకు అంత్యక్రియలు చేపట్టాలని తొలుత నిర్ణయించినా..మూడుగంటల ముందే ఆ ప్రక్రియను ముగించారు.

శుక్రవారం కన్నుమూసిన పునీత్..
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు సంభవించింది. వెంటవెంటనే రెండుసార్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్ ఉన్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని కంఠీరవ స్టూడియోలో ఉంచారు. కొద్దిసేపటి కిందటే అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications