అక్టోబర్ 1 నుంచి భారీగా పెరగనున్న ఏసీ, టీవీల ధరలు!
పండగ సీజన్ సమీపిస్తున్న వేళ కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని ఆశపడే సామాన్యులకు తీవ్ర నిరాశ ఎదురుకానుంది. దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎలక్ట్రానిక్స్ ప్రియులకు గట్టి షాక్ తగలనుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీల ధరలను ఏకంగా 5 నుంచి 8 శాతం వరకు పెంచాలని ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థలు నిర్ణయించాయి. రానున్న అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ ఏడాదిలో కంపెనీలు ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
ధరల పెరుగుదలకు అసలు కారణాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రాగి, ఉక్కు, అల్యూమినియం, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులతో పాటు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ముఖ్యంగా గతంలో టన్ను 8 నుంచి 9 వేల డాలర్లు ఉన్న కాపర్ ధర ప్రస్తుతం ఏకంగా 14,500 డాలర్లకు పైగా చేరుకుందని తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఏసీ తయారీకే సుమారు 3 నుంచి 4 కిలోల రాగి అవసరం అవుతుండటంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్లూ స్టార్, గోద్రెజ్, హయర్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులు స్పష్టం చేస్తున్నారు.

వివిధ బ్రాండ్లవారీగా భారం ఎంతంటే?
బ్లూ స్టార్, గోద్రెజ్ అప్లయన్సెస్, హయర్, డైకిన్, ఎస్పీపీఎల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 4 నుంచి 10 శాతం వరకు పెంచగా.. మరికొన్ని కంపెనీలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ పెంపును అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఎల్జీ, బాష్, హిటాచీ వంటి బ్రాండ్లు కూడా ఇప్పటికే తమ ఏసీ ధరలను సుమారు 5 శాతం వరకు సవరించాయి. ముఖ్యంగా టెలివిజన్ల విభాగంలో చిన్న స్క్రీన్ టీవీలపై 20 శాతం వరకు, పెద్ద స్క్రీన్లపై 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పానాసోనిక్ వంటి కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ అడుగులు వేస్తున్నాయి.
పండగ సీజన్‌పై పడనున్న ప్రభావం ఏమిటి?
సాధారణంగా ఏటా ఓనం నుంచి దసరా, దీపావళి వరకు ఉండే పండగ సీజన్లోనే ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు వార్షిక అమ్మకాల్లో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు వ్యాపారం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ధరలు పెరగడం వల్ల అమ్మకాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, చాలా మంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే పాత ధరలతో భారీగా స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంచడం వల్ల.. ప్రస్తుత దీపావళి వరకు పాత ధరలకే ఉత్పత్తులు లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభయం ఇస్తున్నారు. దీపావళి ముగిసిన తర్వాతే కొత్త ధరల పూర్తి ప్రభావం వినియోగదారులపై పడనుంది.














Click it and Unblock the Notifications
